YCP: పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యే క్షమాపణ

YCP: పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యే క్షమాపణ

ముఖ్యమంత్రి సొంత జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ MLA రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.... పోలీసులతో వ్యవహరించిన తీరు ఆ పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ... పోలీసులను పరుష పదజాలంతో దూషించడం... తీవ్ర విమర్శల పాలైంది. అధిష్ఠానం కలగజేసుకోవడంతో MLA రాచమల్లు...పోలీసులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. మరోవైపు పోలీసులతో అనుచితంగా మాట్లాడిన MLAపై కేసు నమోదు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు పోలీసులతో వ్యవహరించిన తీరు వైసీపీ అధిష్ఠానానికి ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టింది. పుల్లయ్య అనే వ్యక్తి పరిమితికి మించి మద్యం సీసాలు తీసుకుని వెళ్తుండగా... ఎస్ఈబీ పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేందుకు సంతకం పెట్టాలని కోరగా... పుల్లయ్య నిరాకరించారు. అక్కడికి వచ్చిన రాచమల్లు ఎస్ఐ బేగ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్పీకి కాదు, వాళ్ల బాబుకి చెప్పుకో అంటూ దూషించారు. కేసు పెడితే ఒప్పుకోనన్న ఆయన...చట్టాన్ని మార్చుకో, లేకపోతే ప్రభుత్వాన్ని మార్చుకో అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులతో వ్యవహరించిన తీరు అధిష్ఠానం దృష్టికి వెళ్లడంతో... అక్కడి నుంచి ఫోన్లు వచ్చాయి. దీంతో రాచమల్లు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న తాను ఓ సామాన్యుడిలా మాట్లాడానని రాచమల్లు అన్నారు. తన మాటలు పోలీసు అధికారుల మనసు నొప్పించి ఉంటే క్షమించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు MLA రాచమల్లు తీరుపై విపక్షాలు మండిపడ్డాయి. రాచమల్లుపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు.

Next Story