
కాకినాడలో ఓ యువకుడి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. వైసీపీ నేతల భూదాహం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అశోక్ నగర్‌లోని నేతాజీ వీధికి చెందిన 32 ఏళ్ల నున్న శ్రీకిరణ్ రష్యాలో నాలుగేళ్ల పాటు వైద్య విద్య అభ్యసించారు. చదువు మధ్యలో ఆపేసి స్వస్థలం వచ్చారు. వీరికి కాకినాడ సమీపంలో వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి వివాదంలో మనస్తాపానికి గురైన శ్రీకిరణ్ పురుగుల మందు తాగారు. కాకినాడ G.G.Hకు తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీకిరణ్ మృతిచెందారు. భూమి విషయంలో స్థానిక వైసీపీ M.L.A. కన్నబాబు సోదరుడు, అనుచరుడు పెదబాబు తన కుమారుడిని మోసం చేశారని మృతుడి తల్లి ఆరోపించారు. వివాదం పరిష్కారం కోసం వైసీపీ నేతలను ఆశ్రయిస్తే భూమి పత్రాలు తీసుకుని డబ్బు రాదని చెప్పారని తెలిపారు. MLA కన్నబాబు సోదరుడి దౌర్జన్యాలు భరించలేకే శ్రీకిరణ్ ఆత్మహత్య చేసుకున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. భూ ధ్రువపత్రాలు తన వద్దే ఉంచుకుని MLA సోదరుడు శ్రీకిరణ్‌ని వేధించారని మండిపడ్డారు. శ్రీకిరణ్ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులంతా కలిసి.. వైసీపీ నేతల దందాలు, కబ్జాలను ఎదిరించాలని లోకేష్ పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com