కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు
X

నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. గత వారం రోజులుగా దోబూచులాడుతున్న రుతుపవనాలు దేశంలోకి వచ్చాయి. ప్రస్తుతం లక్షద్వీప్‌, కేరళ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల ఆగమన ప్రభావంతో కేరళలో గత 24 గంటల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లు చెప్పింది.

రానున్న 48 గంటల్లో ఇవి కేరళలోని మిగతా ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు మీదుగా కదిలేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు ప్రకటించింది. గంటకు 19 నాట్‌ల వేగంతో పశ్చిమ గాలులు వీస్తున్నట్లు ఐఎండీ పేర్కొంది. అయితే తొలి వారంలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. సాధారణంగా జూన్‌ 1వ తేదీనే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాల్సి ఉండగా.. వాతావరణ మార్పులు, తుఫాన్‌ కదలికల కారణంగా వారం ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. గతేడాది మే 29నే తీరాన్ని తాకాయి. ఈ సీజన్‌లో దేశంలో సాధారణ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.

ఇక.. తెలంగాణలో మరో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం బలహీన పడిందని పేర్కొంది

Tags

Next Story