రెజ్లర్లకు పీటీఉష మద్దతు

డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద స్టార్ రెజ్లర్లు చేస్తున్న ఉద్యమం రెండో వారం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు క్రీడాకారులు రెజ్లర్ల దీక్షకు మద్దతు ప్రకటించారు. తాజాగా భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష... రెజ్లర్లతో భేటీ అయ్యారు. వారికి తనవంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే, రెజ్లర్లు క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పీటీ ఉష.. రెజ్లర్లు నిరసన మొదలుపెట్టిన 11 రోజుల తర్వాత అక్కడకు రావడం విశేషం.
అనంతరం సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియాలతో చర్చలు జరిపారు. దీనిపై స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా మాట్లాడుతూ.. ‘పీటీ ఉష మమ్మల్ని కలిసి తన మద్దతు ప్రకటించారు. అంతకుముందు తాను చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసిన ఉష.. వాటిని తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. తాను తొలుత ఓ క్రీడాకారిణి అని.. ఆ తర్వాతే ఓ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పారు. తమకు న్యాయం జరగడంలో తనవంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు’ అని బజరంగ్ పునియా వెల్లడించారు. అయితే.. జంతర్ మంతర్కు చేరుకున్న పిటీ ఉషా కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com