FIDE Chess World Cup: విదిత్ సంతోష్ సంచలనం

ప్రపంచకప్ చెస్ టోర్నీ(FIDE Chess World Cup) ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి( Vidit Gujrathi) సంచలనం సృష్టించాడు. ప్రపంచ ఐదో ర్యాంకర్, రష్యా గ్రాండ్‌మాస్టర్ ఇయాన్ నిపోమ్‌ని షి(Russian Grandmaster Ian Nepomniachtchi )తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో విదిత్ 4–2తో నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి( quarterfinals) దూసుకెళ్లాడు. నిర్ణీత రెండు క్లాసికల్ గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు ర్యాపిడ్ ఫార్మాట్‌లో టైబ్రేక్ నిర్వహించారు. టైబ్రేక్‌లోనూ ఇరువురు ఆటగాళ్లు హోరాహోరిగా తలపడ్డారు. టైబ్రేక్‌లో తొలి రెండు ర్యాపిడ్ గేమ్‌లు డ్రా అయ్యాయి. 25 నిమిషాల నిడివిగల ఈ రెండు ర్యాపిడ్ గేమ్‌లు డ్రా గా ముగియడంతో 10 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్‌లను ఆడించారు.
ఈ గేమ్స్‌లో గొప్పగా పుంజుకున్న విదిత్ 10 నిమిషాల ర్యాపిడ్ గేమ్‌ల్లో వరుసగా రెండు విజయాలతో పైచేయి సాధించాడు. తొలి గేమ్‌లో 60 ఎత్తుల్లో గెలిచిన విదిత్ రెండో గేమ్‌లో 52 ఎత్తుల్లో నెగ్గాడు. దాంతో విదిత్‌కు క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. ఈ ఏడాది ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్ కోసం చైనాకు చెందిన డింగ్ లీరెన్‌తో తలపడి నిపోమ్‌నిషి ఓడిపోయాడు. ఇప్పుడు నెపోమ్నియాషిపై 4-2 తేడాతో విజయంతో ఈ టోర్నీలో క్వార్టర్స్ చేరిన నాలుగో భారత ఆటగాడిగా విదిత్ నిలిచాడు.
ప్రపంచకప్ చెస్ టోర్నీలో ఇప్పటికే ఇరిగేశి అర్జున్, దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద క్వార్టర్ ఫైనల్ చేరారు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్ తొలి గేమ్‌లలో నార్వేకు చెందిన కార్ల్‌సన్‌తో గుకేశ్... అజర్‌బైజాన్‌కు చెందిన అబసోన్‌తో విదిత్... ప్రజ్ఞానందతో అర్జున్.. అమెరికాకు చెందిన కరువానాతో అదే దేశానికి చెందిన లీనియర్ తలపడనున్నారు. క్వార్టర్స్‌లో తెలంగాణ కుర్రాడు అర్జున్( Arjun Erigasi), తమిళనాడు టీనేజర్ ప్రజ్ఞానంద( R Praggnanandhaa) పరస్పరం తలపడనున్నారు. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు ముందంజ వేస్తారు. ఈ టోర్నీ చరిత్రలో ఇంతమంది భారత ఆటగాళ్లు క్వార్టర్స్ చేరడం ఇదే తొలిసారి. ఈ చెస్ ప్రపంచకప్‌లో క్వార్టర్స్ చేరిన ఎనిమిది మంది ఆటగాళ్లలో నలుగురు భారత ప్లేయర్లే కావడం విశేషం. ఈ టోర్నీలో భారత ఆధిపత్యానికి ఇదే నిదర్శనం.
మరోవైపు మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక(Harika Dronavalli) పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో హారిక 3.5–4.5తో రష్యాకు చెందిన అలెగ్జాండ్రా గోర్యాచ్‌కినా చేతిలో హారిక ఓడిపోయింది. గోరెచ్‌కీనాతో తొలి రెండు గేమ్‌లు డ్రా చేసుకున్న హారిక.. టైబ్రేక్‌లో విజయం కోసం గొప్పగా పోరాడింది. ర్యాపిడ్‌లో ఒక గేమ్ ప్రత్యర్థి గెలవగా.. మరో గేమ్ హారిక నెగ్గింది. ఆ తర్వాత రెండు గేమ్‌లు డ్రా అయ్యాయి. చివరికి బ్లిట్జ్‌లో తొలి గేమ్‌లో హారిక ఓడిపోయింది. ఆ తర్వాత గేమ్ నెగ్గితే ఆమె పోటీలో నిలిచేదే. కానీ ఆ గేమ్‌ను డ్రా చేసుకున్న హారిక 3.5-4.5తో నిష్క్రమించక తప్పలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com