ASHWIN: టెస్టు క్రికెట్ రారాజు అశ్విన్

ASHWIN: టెస్టు క్రికెట్ రారాజు అశ్విన్
X
టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా ఘనత... 537 వికెట్లతో టెస్ట్ క్రికెట్ ను ఏలిన అశ్విన్

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు. బ్రిస్బేన్ టెస్ట్ తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు డ్రా అనంతరం రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన వెలువడింది. 38 ఏళ్ల అశ్విన్ టెస్టు ఫార్మాట్ లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా ఉన్నాడు. లెజండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో అశ్విన్ ఉన్నాడు.

టీమిండియా వెన్నెముకగా..

జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతీసారి అశ్విన్ వంద శాతం ప్రదర్శన ఇచ్చాడు. ఎన్నో రికార్డులను పాదాక్రాంతం చేశాడు. తాను ఎందుకు ప్రత్యేకమైన ఆటగాడినో ప్రతీసారి చాటి చెప్పాడు. ఒక మ్యాచులో విఫలమై తనపై తీవ్ర విమర్శలు వచ్చినా... తర్వాతి మ్యాచులో బంతితోనే దానికి సమాధానం చెప్పేవాడు. అందుకే అశ్విన్.. ఓ క్రికెట్ లెజెండ్. "అంతర్జాతీయ స్ధాయిలో భారత క్రికెటర్‌గా ఇదే నా చివరి రోజు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ నాకు ఇష్టమైన క్రీడను మాత్రం ఇప్పటిలో విడిచిపెట్టను. ఇకపై క్లబ్ క్రికెట్‌లో మాత్రమే ఆడనున్నాను. భారత క్రికెట్‌తో నాకు ఎన్నో అద్బుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ 14 ఏళ్ల ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన భారత క్రికెట్ బోర్డుకు, నా సహచరులకు ధన్యవాదాలు. అదే విధంగా కొంత మంది కోచ్‌లు కూడా నా కెరీర్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. వారికి కూడా స్పెషల్ థాంక్స్‌. అంతేకాకుండా రోహిత్, విరాట్, అజింక్య రహానే, పుజారా వంటి ఆటగాళ్లు స్లిప్స్‌లో క్యాచ్‌లు అందుకోవడం వల్లే ఈ రోజు నేను ఇన్ని వికెట్లు సాధించగలిగాను" అని అశ్విన్ అన్నాడు.

టెస్టు క్రికెట్ లో తనదైన ముద్ర

టెస్టు క్రికెట్‌లో అశ్విన్ తనకంటూ ప్రత్యే‍క గుర్తింపు తెచ్చుకున్నాడు. తన టెస్టు కెరీర్‌లో 106 టెస్టులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్, 537 వికెట్లు పడగొట్టాడు. భారత తరపున అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన జాబితాలో అశ్విన్‌(537) రెండో స్ధానంలో నిలిచాడు. అశ్విన్ కంటే ముందు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే(619) ఉన్నాడు. అదే విధంగా టెస్టుల్లో అశ్విన్‌ ఖాతాలో 35 ఫైవ్ వికెట్ల హాల్స్ ఉన్నాయి.అశ్విన్ తన కెరీర్ లో 268 మంది లెఫ్ట్ హ్యాండర్లను అవుట్ చేశాడు. 2016/17 సుదీర్ఘ సీజన్‌లో అశ్విన్ స్వదేశంలో అద్భుత ఫామ్ తో చెలరేగిపోయాడు. కేవలం నాలుగు సిరీసుల్లో 13 టెస్టు మ్యాచులు ఆడి 82 వికెట్లు సాధించాడు - టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ 13 టెస్టుల్లో 4430 డెలివరీలు వేశాడు. వీటిలో భారత్ 10 టెస్టుల్లో భారత్ గెలిచింది. అశ్విన్ టీమిండియాకు ఎంత కీలకమైన ఆటగాడో చెప్పేందుకు ఇంతకంటే ఎక్కువ గణాంకాలు అవసరం లేదు. అశ్విన్ 537 టెస్ట్ వికెట్లలో 383 స్వదేశంలోనే వచ్చాయి.

Tags

Next Story