ABHISHEK SHARMA:దాయాదితో సమరానికి అభిషేక్ సిద్ధం..!

అభిషేక్ ఏ దశలోనూ అతను దూకుడు తగ్గించడు. ప్రత్యర్థి జట్లకు ఊపిరి సలపనివ్వకుండా షాట్లు కొడుతూనే ఉంటాడు. ఇలా కొన్ని మ్యాచ్‌ల్లో తన మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆరంభంలోనే మ్యాచ్ ఫలితాలను నిర్దేశిస్తున్నాడు. కానీ ఒక మ్యాచ్ చెలరేగితే.. ఇంకో మ్యాచ్‌లో వెంటనే ఔటవుతున్నాడు. చివరి అయిదు మ్యాచ్‌ల్లో మూడుసార్లు తొలి బంతికే వికెట్ సమర్పించుకున్నాడు అభిషేక్. గత నెల న్యూజిలాండ్‌తో తొలి టీ20 35 బంతుల్లోనే 84 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. కానీ తర్వాతి మ్యాచ్‌లో తొలి బంతికే డకౌటయ్యాడు. మూడో టీ20లో 155 పరుగుల లక్ష్యాన్ని భారత్ 10 ఓవర్లకే ఛేదించిందంటే అందుకు ప్రధాన కారణం ఈ కుర్రాడే. ఆ మ్యాచ్‌లో 20 బంతుల్లోనే 68 పరుగులు కొట్టేశాడు. నేడు నమీబియాతో టీమిండియా తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే స్టార్ బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ దూరమయ్యాడు.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు వెళ్లే ముందు ఫిట్నెస్ పునరుద్ధరణపై దృష్టి పెట్టనున్నాడు అభిషేక్. ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా అభిషేక్ పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడాలని, అందుకోసం ఫిట్‌గా ఉండాలని తాపత్రయపడుతున్నాడు. అటు జట్టు యాజమాన్యం నిర్ణయం, ఇటు అభిషేక్ పట్టుదల చూస్తుంటే దాదాపు పాక్ మ్యాచ్‌లో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యం మెరుగుపడుతున్నా.. పూర్తి స్థాయి ఫిట్‌గా లేడట. కొంత రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకోసమే బుధవారం జట్టు ప్రాక్టీస్ సెషన్‌కూ హాజరు కాలేదు. ప్రస్తుతం తన ఆరోగ్యం త్వరగా కుదుటపడేందుకు అభిషేక్ తన వ్యక్తిగత ట్రైనర్‌ను ఢిల్లీకి పిలిపించుకున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
భారత్‌పై సక్లయిన్ ముస్తాక్ అక్కసు
టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. దీనిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సక్లయిన్ ముస్తాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీని బీసీసీఐ ప్రభావితం చేస్తుందన్నాడు. ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞానంతో కొలంబోలోని పిచ్‌ను ఎప్పుడైనా మార్చొచ్చని నిరాధార ఆరోపణలు చేస్తూ.. తన అక్కసు వెల్లగక్కాడు. ‘ఐసీసీ ఎవరి ఒత్తిడికి తలొగ్గి పనిచేస్తుందో మనందరికీ తెలుసు. ప్రస్తుత ఆధునిక కాలంలో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉందంటే.. దాని సాయంతో మనకు తెలియకుండానే గ్రౌండ్స్‌మెన్ ఎప్పుడైనా పిచ్‌ను మార్చొచ్చు’ అని సక్లయిన్ ముస్తాక్ అన్నాడు. అలాగే అతడు బౌలింగ్ ఆర్డర్ గురించి మాట్లాడాడు. ‘భారత్‌తో మ్యాచ్‌కు ముందు ఉస్మాన్ తారిక్ ఆత్మవిశ్వాసాన్ని పొందాడు. కానీ మీకు ఇద్దరు పేసర్లు, ఒక ఆల్‌రౌండర్ అవసరమైతే మొత్తం సమీకరణం మారిపోతుంది. జిమ్మీ నీషమ్‌ను చూడండి. అతడు ఫహీమ్ అష్రఫ్ లాంటివాడు. పాకిస్థాన్ తరపున 20వ ఓవర్ ఎవరు వేస్తారు? తారిక్? నవాజ్? షాదాబ్? అబ్రార్? వారు చివరిగా ఎప్పుడు 20వ ఓవర్ వేశారు. ఫహీమ్ 20వ ఓవర్ వేయగలడో.. లేదో..’ అని సక్లయిన్ ముస్తాక్ విశ్లేషించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
