ABHISHEK: షేక్ చేస్తాడునుకుంటే.. షేక్ అవుతున్నాడే

ఒకసారి డకౌటైతే అది యాదృచ్ఛికం అనుకోవచ్చు. రెండోసారి డకౌటైతే అది ఒత్తిడి అనుకోవచ్చు. కానీ వరుసగా మూడోసారి కూడా అదే పరిస్థితి ఎదురైతే మాత్రం అది ఆందోళనకరమే. టీ20 ప్రపంచకప్ వంటి అత్యంత కీలక టోర్నీలో భారత జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రదర్శన ఇప్పుడు అభిమానుల్లో ఇదే చర్చకు దారితీస్తోంది. భారీ అంచనాల మధ్య ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన ఈ యువ బ్యాటర్ గ్రూప్ దశను ఒక్క పరుగూ చేయకుండా ముగించడం అనూహ్య పరిణామంగా మారింది. టోర్నీ ప్రారంభానికి ముందు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. విరాట్ కోహ్లి లేని లోటును భర్తీ చేసే బాధ్యతను అభిషేక్ భుజాలపై పెట్టారు. దూకుడైన ఆటశైలితో పవర్‌ప్లేలోనే మ్యాచ్ తేల్చగల సామర్థ్యం అతనికి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రత్యర్థి జట్లకు అతనే ప్రధాన ముప్పు అవుతాడని అంచనాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగే హైప్రొఫైల్ పోరులో అతని పాత్ర కీలకమని భావించారు. కానీ అంచనాలు ఎంత ఎత్తులో ఉన్నాయో, ఫలితం అంతకంతకూ నిరాశ కలిగించేలా మారింది.
గ్రూప్ దశలో భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అభిషేక్ బ్యాటింగ్‌కు దిగినా ఒక్కటంటే ఒక్క పరుగూ చేయలేకపోయాడు. పాకిస్థాన్, అమెరికా, నెదర్లాండ్స్ వంటి జట్లపై కూడా ఖాతా తెరవలేకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. అంతర్జాతీయ స్థాయిలో, ముఖ్యంగా ప్రపంచకప్ వేదికపై ఇలా వరుసగా మూడు డకౌట్లు నమోదు చేయడం అరుదైన సంఘటన. ఈ చెత్త రికార్డు అతని పేరిట నిలిచిపోయే అవకాశముందన్న చర్చ కూడా మొదలైంది. నమీబియాతో జరిగిన ఒక మ్యాచ్‌లో అనారోగ్యం కారణంగా అతను ఆడలేదు. అయితే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ అతని ఆటలో ఒకే విధమైన లోపం కనిపించింది. సహజంగా అతని ఆటశైలి దూకుడే అయినప్పటికీ, క్రీజులో కుదురుకునే వరకు ఓర్పు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు కూడా ఇదే విషయాన్ని సూచించారు. మొదట కొన్ని బంతులు ఆచితూచి ఆడి, తర్వాత దాడి ప్రారంభిస్తే మంచిదని చెప్పారు. అయితే అభిషేక్ మాత్రం తన సహజ శైలిని మార్చేందుకు ప్రయత్నించలేదు.
లోపిస్తున్న సహనం
ప్రత్యేకంగా రెండు డాట్‌బాల్స్ పడగానే అతను ఆతురతకు లోనవుతున్నట్లు కనిపించింది. బౌలర్లను తక్కువ అంచనా వేసి, బంతి నాణ్యతను గమనించకుండా అడ్డదిడ్డంగా షాట్లు ఆడే ప్రయత్నం చేశాడు. ఫలితంగా పాకిస్థాన్, నెదర్లాండ్స్ మ్యాచ్‌ల్లో వికెట్ కోల్పోయాడు. సింగిల్ తీసుకుని స్ట్రైక్ రొటేట్ చేయాలని సునీల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సూచించినా, ఆ సూచనలను అమలు చేయలేకపోయాడు. అతని లోపలి విధ్వంసక బ్యాటర్ అహం, ఓర్పును దెబ్బతీస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టోర్నీకి ముందు అతనిపై ఉన్న అంచనాలు ఇప్పుడు పూర్తిగా తలకిందులయ్యాయి. ప్రత్యర్థి బౌలర్లను షేక్ చేస్తాడనుకున్న ఓపెనర్ ఇప్పుడు ఒత్తిడితో తానే షేక్ అయినట్లు కనిపిస్తున్నాడు. వరుస వైఫల్యాలు ఒక ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా ప్రపంచకప్ వంటి పెద్ద వేదికపై ఆ ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఈ స్థితిలో మానసికంగా బలంగా ఉండటం అత్యంత అవసరం. మరి సూపర్ 8 సమరంలో అభిషేక్ తన పంథా మారుస్తాడేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
