Afg vs Ban: రెండో వన్డేలోనూ ఆఫ్ఘాన్‌దే విజయం, సిరీస్‌ సొంతం

Afg vs Ban: రెండో వన్డేలోనూ ఆఫ్ఘాన్‌దే విజయం, సిరీస్‌ సొంతం
*గుర్భాజ్ 125 బంతుల్లో 145 పరుగులు, 13 ఫోర్లు, 8 సిక్సులు *ఇబ్రహీం జద్రాన్ 119 బంతుల్లో 100 పరుగులు, 9 ఫోర్లు, 1 సిక్స్

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ని ఆఫ్ఘనిస్థాన్‌ గెలుచుకుంది. శనివారం జరిగిన రెండవ వన్డేలో బంగ్లా జట్టును 142 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఆఫ్ఘాన్ ఓపెనర్లు రహ్మనుల్లా గుర్భాజ్ 145 పరుగులు చేసి కెరీర్‌లో బెస్ట్ స్కోర్ నమోదు చేశాడు. మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్‌ కూడా 100 పరుగులతో సెంచరీ చేసి విజయానికి బాటలు వేశారు. బంగ్లా బ్యాట్స్‌మెన్లలో ముష్ఫికర్ రహీం ఒక్కడే 69 పరుగులతో పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది.

332 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలో దిగిన బంగ్లా ఏ దశలోనూ లక్ష్యం వైపు కదల్లేదు. 5వ ఓవర్లోనే ఓపెనర్ లిట్టన్‌ దాస్‌ వికెట్‌ కోల్పోయింది. 6వ ఓవర్లో అద్భుతమైన స్పిన్‌తో షాంటోని ముజీబ్ బౌల్డ్ చేశాడు. 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 28 పరుగులు మాత్రమే చేసింది. తరువాత వచ్చిన సీనియర్ బ్యాట్స్‌మెన్ షకీబుల్ హసన్ బౌండరీలతో వేగం పెంచాడు. అయితే స్పిన్నర్‌ నజీబ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా బంగ్లా వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం ఒక్కడే నిలకడగా ఆడుతూ అడపా దడపా బౌండరీలతో పోరాటం చేశాడు. ఈ క్రమంలో 62 పరుగుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఫజల్ ఫారుఖీ బౌలింగ్‌లో 9వ వికెట్‌గా వెనుదిరిగాడు. బంగ్లా బ్యాట్స్‌మెన్ ఇబాదత్ బ్యాటింగ్‌ రాకపోవడంతో విజయం ఆఫ్ఘాన్ సొంతమైంది. ఆఫ్ఘాన్ బౌలర్లలో ఫారుఖీ, ముజీబ్‌లు చెరో 3 వికెట్లు తీయగా, రషీద్ ఖాన్ 2, నబీ 1 వికెట్ పడగొట్టారు.


అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన ఆఫ్ఘాన్‌ ఓపెనర్లు బంగ్లా బౌలర్లకి చుక్కలు చూయించారు. ఓపెనర్లు గుర్భాజ్, ఇబ్రహీంలు బౌండరీలు, సిక్సులతో స్కోర్‌బోర్డుని ఉరకలెత్తించారు. గుర్భాజ్ 100 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 145 పరుగులు చేసిన గుర్భాజ్ షకీబ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఓపెనర్లిద్దరూ కలిసి 256 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఆప్ఘానిస్థాన్‌ తరఫున వన్డేల్లో ఏ వికెట్‌కైనా ఈ స్కోరే అత్యధిక భాగస్వామ్యం. అనంతరం 4 ఓవర్లనే మరో 2 వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ 118 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.తరువాతి బంతికే ఔటై పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన ఆఫ్ఘాన్ బౌలర్లు బౌండరీలతో స్కోర్‌ని 50 ఓవర్లలో 9 వికెట్లకు 331 పరుగులు చేశారు. రహ్మదుల్లా గుర్భాజ్ ఫ్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

Tags

Read MoreRead Less
Next Story