IPL: బుమ్రా మెరిశాడు.. సూర్య దంచాడు

ఐపీఎల్‌లో బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతోంది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి.... 196 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పైనా.... బెంగళూరు బ్యాటర్లు తడబడ్డారు.
ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లీ తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం... మూడే పరుగులు చేసి వెనుదిరిగాడు. బెంగళూరు సారధి ఫాఫ్ డుప్లెసిస్, రజత్ పటిదార్, దినేశ్ కార్తీక్ అర్ధ శతకాలతో మెరిశారు. బుమ్రా అయిదు వికెట్లతో బెంగళూరు పతనాన్ని శాసించాడు. అనంతరం 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై మరో 27 బంతులు మిగిలి ఉండగానే కేవలం మూడు వికెట్లు కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ రాణించగా... సూర్యకుమార్ యాదవ్ ధనాధన్ బ్యాటింగ్‌తో ముంబైకు ఘన విజయాన్ని కట్టపెట్టాడు. ఇషాన్ కిషన్ 69, రోహిత్ శర్మ 38 పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్ కేవలం 19 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సులతో 52 పరుగులు చేశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు శుభారంభం లభించలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీని బుమ్రా అవుట్ చేశాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం మూడే పరుగులు చేసి కోహ్లీ వెనుదిరిగాడు. కాసేపటికే విల్ జాక్స్ కూడా అవుటయ్యాడు. ఫాఫ్ డుప్లెసిస్, రజత్ పాటిదార్ బెంగళూరును ఆదుకున్నారు. డుప్లెసిస్ 40 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లో 61 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో అవుటయ్యాడు. 26 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో రజత్ పాటిదార్ 50 పరుగులు చేసి అవుటయ్యాడు. మ్యాక్స్‌వెల్ మరోసారి నిరాశపరిచాడు. ఒక్క పరుగు కూడా చేయకుండా అవుటయ్యాడు. దినేశ్ కార్తీక్ బెంగళూరుకు పోరాడే స్కోరును అందించాడు. కార్తీక్ కేవలం 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 53 పరుగులు చేశాడు. బుమ్రా అయిదు వికెట్లతో బెంగళూరు పతనాన్ని శాసించాడు.
197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ముంబై ఓపెనర్లు ఇషాన్ కిషన్-రోహిత్ శర్మ వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయాన్ని చాలా తేలికగా మార్చేశారు. 8.5 ఓవర్లలోనే స్కోరు బోర్డును వంద పరుగులు దాటించారు. ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులతో 69 పరుగులు చేసి అవుటవ్వగా.... రోహిత్ శర్మ 24 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సులతో 38 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో సూర్య 52 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో ముంబై మరో 27 బంతులు మిగిలి ఉండగానే కేవలం మూడు వికెట్లు కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com