Ambati Rayudu: మళ్లీ బ్యాట్ పట్టనున్న అంబటి రాయుడు

టీమ్‌ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు అంబటి రాయుడు (Ambati Rayudu) మళ్లీ బ్యాట్ పట్టి బరిలోకి దిగనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఈమధ్యే వీడ్కోలు పలికిన రాయుడు....కరీబియన్ ప్రిమియర్ లీగ్(Caribbean Premier League)లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియట్స్(St Kitts & Nevis Patriots) జట్టుతో అతను ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రవీణ్ తాంబె తర్వాత ఈ లీగ్‌లో పాల్గొంటున్న రెండో భారత ఆటగాడిగా రాయుడు గుర్తింపు పొందాడు. అమెరికాలో నిర్వహించిన మేజర్ క్రికెట్ లీగ్ (MLC)లో చెన్నై సూపర్‌కింగ్స్(CSK)కు చెందిన టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు ఆడేందుకు కూడా రాయుడు సంతకం చేశాడు. అయితే బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం కరీబియన్ ప్రిమియర్ లీగ్‌లో ఆడేందుకు రాయుడుకు అటంకం కలిగే అవకాశం ఉంది.
బీసీసీఐ నిబంధన ప్రకారం.. ఇటీవల కాలంలో రిటైర్డ్ అయిన భారత క్రికెటర్లు ఇతర దేశాల ప్రాంఛైజీ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగం కాకుడదు. ఈ నిబంధన కారణంగానే అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ టి20 టోర్నమెంట్‌లో కూడా రాయుడు భాగం కాలేదు. ఈ ఏడాది సీజన్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు తరపున రాయుడు బరిలోకి దిగాల్సి ఉంది. ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత అన్నిఫార్మాట్‌ల క్రికెట్ నుంచి రాయుడు తప్పుకున్నాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టుతో జత కట్టినందుకు చాలా సంతోషంగా ఉందని రాయుడు తెలిపాడు. కాగా CCL-2023 సీజన్ ఆగస్టు 16 నుంచి ప్రారంభం కానుంది.
2010లో ముంబై ఇండియన్స్ తరపున IPLఅరంగేట్రం చేసిన రాయుడు 203 మ్యాచ్‌లు ఆడాడు. 2010 నుంచి 2017 సీజన్ వరకు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం 2018 సీజన్‌లో చెన్నైసూపర్‌కింగ్స్ జట్టులోకి చేరాడు. 2013, 2015, 2017 సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టులో రాయుడు సభ్యుడు. IPL కెరీర్‌లో 203 మ్యాచులు ఆడిన అంబటి రాయుడు, 186 ఇన్నింగ్స్‌ల్లో 4329 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
2019 వన్డే వరల్డ్ కప్‌లో తనకి చోటు దక్కకపోవడంతో మనస్థాపం చెందిన అంబటి రాయుడు, సెలక్టర్ల మీద కోపంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు అర్ధాంతరంగా ప్రకటించాడు. అయితే ఆ తర్వాత ఆ రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకున్నాడు.. టీమిండియా తరుపున 55 వన్డేలు, 6 టీ20 మ్యాచులు ఆడిన అంబటి రాయుడు, వన్డేల్లో 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలతో 1694 పరుగులు చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com