Anshu Malik: 20 ఏళ్ల రెజ్లర్.. వరల్డ్ ఛాంపియన్‌షిప్ రికార్డ్..

Anshu Malik: ఒకప్పుడు కుస్తీ, రెజ్లింగ్, క్రికెట్ కబడ్డీ లాంటి ఆటలు మగవారికి మాత్రమే పరిమితం. కానీ కాలం మారుతున్న కొద్దీ మహిళలు కూడా తమ శక్తికి పరిమితులు పెట్టుకోకుండా ఏ రంగంలో అయినా తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆట మగవారికి మాత్రమే అనే ట్యాగ్‌లు తొలిగిపోయాయి. ఏ ఆట అయినా మేము కూడా గెలిచి చూపించగలం అని మహిళలు ముందుకొస్తున్నారు. అలా గెలిచి నిరూపించిన వారు కూడా ఎందరో ఉన్నారు.
రెజ్లింగ్‌లో ఆడవారికి స్థానం లేని రోజుల్లోనే పలువురు అమ్మాయిలు వచ్చి రెజ్లర్స్‌గా నిరూపించుకున్నారు. మెల్లమెల్లగా ఆడవారికి కూడా సెపరేట్‌గా రెజ్లింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. దాంతో చాలామంది అమ్మాయిలు, మహిళలు రెజ్లింగ్‌పై ఆసక్తి చూపించారు. అలాగే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో కూడా పతకాలు గెలుచుకుని ఇండియాను గర్వపడేలా చేసారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో అమ్మాయి చేరింది.
అన్షు మాలిక్.. తన వయసు 20 ఏళ్లే. చిన్న వయసే కదా.. అని తక్కువగా చూడకూడదు. ఈ వయసులోనే అన్షు ఇప్పటివరకు ఏ రెజ్లర్ సాధించని ఘనతను సాధించింది. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో 57 కేజీల విభాగంలో ఫైనల్స్ వరకు చేరుకున్న అన్షు చివరి వరకు బంగారు పతకం కోసం పోరాడింది. కానీ లాస్ట్ రౌండ్‌లో ఓటమినే చవిచూసింది. దీంతో ఆమె రజతంతో సరిపెట్టుకుంది. గెలిచింది రజతమే అయినా వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకాన్ని సాధించిన తొలి భారతీయ మహిళగా అన్షు రికార్డు సృష్టించింది.
వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 59 కేజీల రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ సరితా మోర్ కాంస్యాన్ని సాధించింది. ఇంకా మహిళలు ఎక్కడో వెనకబడే ఉన్నారు అనిపిస్తున్న ఈ సమయంలో అన్షు మాలిక్, సరితా మోర్ లాంటి వారు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని మరికొందరు మహిళలు తమకు నచ్చిన దాంట్లో విజయం సాధిస్తే సమాజంలో మరింత ప్రగతి కనిపించే అవకాశాలు ఉంటాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com