Arjun Tendulkar: 9 వికెట్లు తీసి కర్ణాటకను బెంబేలెత్తించిన అర్జున్ టెండూల్కర్

దేశంలో ప్రస్తుతం రంజీట్రోఫీలు జరుగుతున్నాయి. జూనియర్ ఆటగాళ్లతోపాటు టీమిండియా ప్లేయర్లు కూడా మైదానంలో సందడి చేస్తున్నారు. డాక్టర్ (కెప్టెన్) కే తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నమెంట్(కేఎస్‌సీఏ ఇన్విటేషనల్)లో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ మెరిశాడు. గోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 24 ఏళ్ల అర్జున్ కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్లు తీసుకుని జట్టు ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో గోవా జట్టు ఇన్నింగ్స్ 189 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తొలి ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లు వేసి 41 పరుగులిచ్చి 5 వికెట్లు నేలకూల్చిన అర్జున్.. రెండో ఇన్నింగ్స్‌లో13.3 ఓవర్లు వేసి 46 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. అర్జున్ దెబ్బకు కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత గోవా తన తొలి ఇన్నింగ్స్‌లో 413 పరుగుల భారీ స్కోరు చేసింది. అభినవ్ తేజ్‌రాణా సెంచరీ (109)తో చెలరేగాడు. మంథన్ ఖుత్కర్ 69 పరుగులు చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక 30.4 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలి ఇన్నింగ్స్ 189 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com