PARA OLYMPICS: అదరగొట్టిన శీతల్ దేవి

ఇండియాకు చెందిన ఆర్మ్ లెస్ ఆర్చర్ శీతల్ దేవి మొదట్లోనే అదరగొట్టింది. గురువారం జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ ర్యాంకింగ్ రౌండ్‌లో అద్భుత ప్రదర్శన చేసి రెండవ స్థానంలో నిలిచింది. పారిస్ పారాలింపిక్స్‌లో 16వ రౌండ్‌లోకి నేరుగా ప్రవేశించింది. కచ్చితంగా పతకం గెలుస్తుందనే అంచనాలున్న ఈ యువ ఆర్చర్.. ర్యాంకింగ్ రౌండ్లో ఉత్తమ ప్రదర్శనతో అంచనాలు పెంచేసింది. మరోవైపు పారాలింపిక్స్ తొలి రోజు బ్యాడ్మింటన్‌లోనూ భారత పారా షట్లర్లు సుకాంత్, సుహాస్, తరుణ్ శుభారంభం చేశారు. పారా సైక్లింగ్ మహిళల సీ1-3 3000మీ.పర్స్యూట్ క్వాలిఫయింగ్‌లో భారత అథ్లెట్ జ్యోతి గదేరియా పదో స్థానంలో నిలిచింది.
సుకాంత్, సుహాస్ బోణి
పారాలింపిక్స్‌లో భారత పారా షట్లర్లు సుకాంత్, సుహాస్, తరుణ్ మంచి ప్రారంభాన్నిచ్చారు. పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్4 విభాగంలో గ్రూప్- బిలో సుకాంత్ 17-21, 21-15, 22-20 తేడాతో అమిన్ (మలేసియా)పై పోరాడి గెలిచాడు. గ్రూప్-డిలో తరుణ్ 21-17, 21-19తో జేవియర్ (బ్రెజిల్)పై, గ్రూప్-ఏలో సుహాస్ 21-7, 21-5తో హిక్మత్ (ఇండోనేసియా)పై విజయం సాధించారు. ఎస్‌ఎల్3 సింగిల్స్ గ్రూప్-ఏలో నితేశ్ కుమార్ 21-13, 18-21, 21-18తో సహచర షట్లర్ మనోజ్ సర్కార్‌పై నెగ్గారు. ఎస్‌హెచ్6 గ్రూప్-ఏలో శివరాజన్ 15-21, 17-21తో సుభాన్ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్‌లో ఎస్‌యూ5 గ్రూప్-ఏలో తులసిమతి 21-9, 21-11తో రోసా (ఇటలీ)పై, గ్రూప్-బిలో మనీష 8-21, 21-6, 21-19తో లెఫోర్ట్ (ఫ్రాన్స్)పై, ఎస్‌ఎల్4 గ్రూప్-సిలో పలక్ కోహ్లి 21-12, 21-14తో మిలెనా (ఫ్రాన్స్)పై, ఎస్‌హెచ్6 గ్రూప్-ఏలో నిత్యశ్రీ 21-7, 21-8తో సిమన్ (అమెరికా)పై పైచేయి సాధించారు.
గురిపెడితే... రికార్డులే
జమ్మూ కాశ్మీర్‌కు చెందిన 17 ఏళ్ల అమ్మాయి శీతల్. ఫోకోమెలియా సిండ్రోమ్ అనే పుట్టుకతో వచ్చే అరుదైన వ్యాధితో జన్మించింది. ఈ క్రమంలో.. ఆమె అవయవాలు అభివృద్ధి చెందలేదు. చేతులు లేకుండానే జన్మించి.. కాళ్లతో విలువిద్య సాధన చేస్తోంది. శీతల్ 720కి 703 పాయింట్లు సాధించి టర్కీకి చెందిన ఓజ్నూర్ గిర్డి క్యూర్ తర్వాత రెండో స్థానంలో నిలిచి అత్యుత్తమ ప్రదర్శన చేసింది. దీంతో శీతల్ ఈ క్రీడల్లో బలంగా పోటీలో నిలిచి, పతకం ఆశలు రేకెత్తించింది. ఒజ్నూర్ ర్యాంకింగ్ రౌండ్‌లో 704 పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టించింది. ర్యాంకింగ్ రౌండ్‌లో శీతల్‌తో సహా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న ఆర్చర్లు 32 రౌండ్‌లో బై పొందారు. చిలీకి చెందిన మరియానా జునిగా, కొరియాకు చెందిన చోయ్ నా మి మధ్య జరిగే రౌండ్ ఆఫ్ 32 విజేతతో శీతల్ పోటీ పడనుంది. మరో భారత పారా ఆర్చర్ సరిత (682) తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది. పురుషుల రికర్వ్ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో టోక్యో పారాలింపిక్స్ కాంస్య విజేత హర్విందర్ సింగ్ (637) 9వ స్థానంలో నిలిచాడు.
పారాలింపిక్స్‌లో నేటి క్రీడాంశాలు
భారత పతకాంశాలు... షూటింగ్: మహిళల 10మీ.ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 క్వాలిఫికేషన్ (అవని లేఖరా, మోనా అగర్వాల్)- మధ్యాహ్నం 12.30, ఫైనల్- మధ్యాహ్నం 3.15; పురుషుల 10మీ.ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 క్వాలిఫికేషన్ (రుద్రాన్ష్, మనీశ్)- మధ్యాహ్నం 2.45, ఫైనల్- సాయంత్రం 5.30; మిక్స్‌డ్ 10మీ.ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్2 క్వాలిఫికేషన్ (శ్రీహర్ష)- సాయంత్రం 5, ఫైనల్- రాత్రి 7.45 జరుగుతాయి.
అథ్లెటిక్స్: మహిళల డిస్కస్ త్రో ఎఫ్55 ఫైనల్ (జ్యోతి, సాక్షి)- మధ్యాహ్నం 1.30; మహిళల 100మీ.పరుగు టీ35 ఫైనల్ (ప్రీతి)- సాయంత్రం 4.45; పురుషుల షాట్‌పుట్ ఎఫ్37 ఫైనల్ (మను)- రాత్రి 12.22కు పోటీలు జరుగుతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com