ashes 2023 women's test : రసవత్తరంగా మారిన యాషెస్ టెస్ట్

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న ఏకైక యాషెస్ టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. సోమవారం 5వ రోజు మ్యాచ్ ఖచ్చితంగా ఫలితం తేలనుంది. 268 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్లు మంచి శుభారంభం అందించినప్పటికీ వరుస వికెట్లతో కష్టాల్లో పడింది.
268 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ ఓపెనర్లు ఎమ్మా లాంబ్, టామీ బీమాంట్ ధాటిగా ఆడుతూ శుభారంభానందించారు. అయితే వీరిద్దరూ వరుసగా ఔటయ్యారు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌ఉమెన్ కూడా వెనువెంటనే వెనుదిరగడంతో ఇంగ్లాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. వికెట్ పడకుండా 55 పరుగులతో విజయం దిశగా సాగిన ఇంగ్లాండ్ ఒక్కసారిగా 73 పరుగులకు 4 వికెట్లను చేజార్చుకుంది. సోఫీ డంక్లీ, డానీ వ్యాట్ వికెట్లు కాపాడుతూ విలువైన 37 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అనంతరం డంక్లీ కూడా పెవిలియన్ చేరింది.
4వ రోజును 82 పరుగులతో ప్రారంభించిన ఆస్ట్రేలియా వరుస వికెట్లు పడటంతో భారీ లక్ష్యం ఉంచలేకపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో స్పిన్నర్ ఎక్లెస్టోన్ అద్భుత బౌలింగ్, పేస్ బౌలర్ల ఎదురుదాడి చేయడంతో వెనువెంటనే వికెట్లు పడ్డాయి. లంచ్‌కి ముందు ఇంగ్లాండ్ బౌలర్ లారెన్ ఫైలర్ 2 వికెట్లు తీసి ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేయకుండా నిలువరించింది. ఇంగ్లాండ్ ఫీల్డర్లు పలు క్యాచ్‌లు మిస్ చేయడం ఆస్ట్రేలియాకు లాభించింది.
ఇంగ్లాండ్ గెలవాలంటే ఇంకా 152 పరుగులు చేయాల్సి ఉంది.. 5 వికెట్లు చేతిలో ఉండటంతో వికెట్లు కాపాడుకుంటే ఇంగ్లాండ్‌కి ఛేదన కష్టమేమీ కాకపోవచ్చు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిస్తే మహిళల క్రికెట్‌లో ఇదే అత్యధిక ఛేదనగా రికార్డ్ సృష్టిస్తుంది. అయితే 5వ రోజు పిచ్ స్పిన్, బౌన్స్‌కి అనుకూలిస్తుండటంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com