Eng vs Aus: పట్టు బిగిస్తోన్న ఇంగ్లాండ్, ఆసీస్ గెలిస్తే అద్భుతమే

4ఒth Ashes Test: 4వ యాషెస్ టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు పట్టు బిగిస్తోంది. వన్డే తరహాలో మొదటి ఇన్సింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ అదే జోరును 3వ రోజూ కొనసాగించింది. నిన్న ఓపెనర్ క్రాలే జోరు కొనసాగించగా, 3వ రోజు ఆ భాద్యత కీపర్ బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్(51), హ్యారీ బ్రూక్(61)లు తీసుకున్నారు. బెయిర్‌స్టో 99 పరుగుల(10x4, 4x6)తో నాటౌట్‌గా నిలిచి 1 పరుగు తేడాతో సెంచరీ చేసే ఛాన్స్ కోల్పోయాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 592 పరుగుల భారీ స్కోర్ సాధించిన ఇంగ్లాండ్, 275 పరుగుల తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది.4, 5వ రోజుల్లో మాంచెస్టర్‌లో వర్షం పడే సూచనలు ఉండటంతో మ్యాచ్ ఫలితం ఎలా రానుందో ఆసక్తికరంగా మారింది.
2వ ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా మార్క్ వుడ్ ధాటికి 113 పరుగులకే 4 కీలకమైన వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ ఆధిక్యానికి ఇంకా 162 పరుగులు వెనకబడి ఉంది. మార్నస్ లబుషేన్(44), మిషెల్ మార్ష్(1)లు క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా మళ్లీ లీడ్‌లోకి వచ్చి గెలవాలంటే అద్భుతమే జరగాల్సి ఉంది.
ఇంగ్లాండ్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్, షార్ట్ పిచ్లో బౌలింగ్ వేయడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి కష్టపడ్డారు. తను వేసిన మొదటి ఓవర్లోనే మార్క్ వుడ్ ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేశాడు. అనంతరం 18వ ఓవర్లో మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ని కూడా వెనక్కి పంపాడు. క్రీజులోకి వచ్చిన లబుషెన్, స్టీవ్ స్మిత్‌లు మరో వికెట్ పడకుండా మరో 12 ఓవర్ల దాకా పట్టుదలతో ఆడారు. 31వ, 37వ ఓవర్లో మరో సారి మార్క్ వుడ్ మెరవడంతో స్పల్ప పరుగుల వ్యవధిలోనే స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్‌లను ఔట్ చేసి దెబ్బకొట్టాడు. మార్ష్, లబుషేన్లు మరో వికెట్ పడకుండా 3వ రోజు ముగించారు. వుడ్ 3 వికెట్లు తీయగా, వోక్స్ మరో వికెట్ తీశాడు.
అంతకుముందు 384 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో ఆరంభించిన హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్‌లు దూకుడును కొనసాగించారు. 72 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న స్టోక్స్ మరో 2 బంతుల తర్వాత కమిన్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. బ్రూక్ కూడా 80 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేశాడు. బ్రూక్ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. అప్పటికీ ఇంగ్లాండ్ ఆధిక్యం 157 పరుగులు మాత్రమే. బ్యాట్స్‌మెన్లలో బెయిర్‌స్టో ఒక్కడే ఉండగా ఆధిక్యం 200లోపే ఉండేలా కనిపించింది. మరోవైపు వికెట్లు పడుతున్నా బెయిర్‌స్టో దూకుడైన బ్యాటింగ్‌తో స్కోర్‌బోర్డ్ పరుగులెత్తింది.
టీ తర్వాత సిక్స్‌తో అర్ధసెంచరీ పూర్తి చేసుకుని, చెరేగి ఆడాడు. మరో ఎండ్‌లో జేమ్స్ ఆండర్సన్ స్ట్రైక్ ఎక్కువగా బెయిర్‌స్టోకే ఇచ్చేలా ఆడాడు. తను మరో 49 పరుగుల్ని 31 బంతుల్లోనే చేశాడు. చివరి వికెట్‌కి ఆండర్సన్‌తో కలిసి 66 పరుగులు జోడించాడు. చివరి వికెట్‌గా ఆండర్సన్ ఎల్బీగా ఔటవ్వడంతో ఒక్క పరుగు దూరంలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్ వుడ్ 5 వికెట్లు తీశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com