IPL: ఢిల్లీ సంచలన విజయం

ఐపీఎల్‌లో తొలి మ్యాచులోనే ఢిల్లీ సంచలనం సృష్టించింది. ఓటమి ఖాయమనుకున్న మ్యాచులో అద్భుత పోరాటంతో లక్నోపై సంచలన విజయం సాధించింది. అసలు ఏ దశలోనూ విజయం దిశగా సాగని ఢిల్లీ... చివర్లో అద్భుతమే చేసింది. 135 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయమనుకున్న దశ నుంచి గెలిచింది. అశుతోష్ శర్మ... ఒంటరి పోరాటం చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. అశుతోష్ శర్మ(66, 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్ తో లక్నో సూపర్ జయింట్స్ తో చివరి వరకు హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో ఒక వికెట్ తేడాతో నెగ్గి ఢిల్లీ ఊపిరి పీల్చుకుంది. విశాఖ వేదికగా అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరో వరకు విజయం ఇరు జట్లతో దోబూచులాడింది. చివరి ఓవర్లో అశుతోష్ శర్మ సిక్సర్ కొట్టి ఢిల్లీకి థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసి గెలిచింది.
లక్నో విధ్వంసం...
విశాఖ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో... ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 210 భారీ టార్గెట్ ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన లఖ్‌నవూ 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. పూరన్(75), మార్ష్(72) ఢిల్లీ బౌలర్లపై ఓరేంజ్‌లో విరుచుకుపడ్డారు. తొలుత లక్నో దూకుడుకు 250 వరకు స్కోర్ వెళ్తుందని అందరూ భావించారు. కానీ ఢిల్లీ బౌలర్లు పుంజుకుని వికెట్లు తీయడంతో స్కోర్ తగ్గింది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 6 ఫోర్లు.. 6 సిక్సర్లతో 72 పరుగులు చేసి దుమ్ములేపాడు. లక్నో బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకోగా.. ముకేశ్, నిగమ్ లకు తలో వికెట్ లభించింది.
అశుతోష్ విధ్వంసంతో....
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. పవర్ ప్లే ముగిసే లోపే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. జేక్ ఫ్రెజర్ మెక్‌గుర్క్ (1), అభిషేక్ పోరెల్ (0), సమీర్ రిజ్వీ (1) స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. ఢిల్లీ రెండు ఓవర్లలోపే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 65 పరుగులకే ఢిల్లీ ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయమనుకునే స్థితికి వచ్చింది. ఈ దశలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అశుతోశ్.. స్టబ్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అశుతోష్ శర్మ (66*; 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. విప్రజ్ నిగమ్ (39; 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ట్రిస్టన్ స్టబ్స్ (34; 22 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 6 పరుగులు అవసరమయ్యాయి. మోహిత్ శర్మ.. సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. ముందుకు వచ్చి బంతిని మిస్ అయ్యాడు. కానీ కీపర్ పంత్.. బంతిని చేజార్చి స్టంపింగ్ మిస్ చేశాడు. అనంతరం అశుతోష్ సింగిల్ తీసి.. మోహిత్ స్ట్రైక్ ఇచ్చాడు. తర్వాత సిక్స్‌తో అశుతోష్ మ్యాచ్‌ను ముగించాడు. పంత్.. స్టంపింగ్ చేస్తే లక్నో విజయం సాధించేది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com