Sri Lanka squad: శ్రీలంకకు దెబ్బ మీద దెబ్బ

Sri Lanka squad: శ్రీలంకకు దెబ్బ మీద దెబ్బ
ఆసియా కప్‌నకు నలుగురు కీలక ఆటగాళ్లు దూరం.... డాసున్‌ శనక నేతృత్వంలో జట్టు ప్రకటన.....

నేటి నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్‌-2023(Asia Cup 2023) కు ముందు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ శ్రీలంక(sri lanka)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ జట్టులోని స్టార్‌ ఆటగాళ్లంతా గాయాలు, కోవిడ్‌ కారణంగా ఒక్కొక్కరుగా జట్టుకు దూరమయ్యారు. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతోనే ఎట్టకేలకు శ్రీలంక తమ జట్టు(Sri Lankan squad )ను ప్రకటించింది. డాసున్ శనక( Dasun Shanaka ) నాయకత్వంలో 15 మందితో కూడిన జట్టు(Sri Lanka's Asia Cup squad )ను శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది.

గాయాల కారణంగా నలుగురు కీలకమైన ఆటగాళ్లు ఆసియా కప్‌నకు దూరం కావడం లంక జట్టులో సమతుల్యాన్ని దెబ్బతీసింది. ఈ టోర్నీకి స్టార్‌ ఆల్‌రౌండర్‌ వానిందు హసరంగతోపాటు బౌలర్లు దుష్మంత చమీరా(Dushmantha Chameera), లాహిరు మధుశంక, లాహిరు కుమార దూరమయ్యారు. శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌లో చమీర భుజానికి, హసరంగ తొడకు గాయాలయ్యాయి. అయితే, ఇదే టోర్నీలో కరోనా పాజిటివ్‌గా తేలిన బ్యాటర్‌ కుశాల్‌ పెరీరా(Kusal Janith Perera)కు చోటు దక్కింది. ప్రస్తుతం అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడు. పూర్తిగా కోలుకోగానే జట్టులో చేరతాడని శ్రీలంక క్రికెట్ బోర్డు పేర్కొంది. అతడు రెండేళ్ల తర్వాత వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. హసరంగ స్థానంలో దుషన్ హేమంత తీసుకున్నారు. ఆవిష్క ఫెర్నాండో కోవిడ్‌తో బాధపడుతూ జట్టుకు దూరంగా ఉన్నాడు.


ఆసియా కప్‌లో శ్రీలంక తమ మొదటి మ్యాచ్‌ ఆగస్టు 31న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌ ఆగస్ట్‌ 31న పల్లెకెలె వేదికగా జరుగనుంది. గతేడాది పొట్టి ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌ను శ్రీలంక గెలుచుకుంది. ఆసియాకప్‌లో ఆరు దేశాలు( six teams) తలపడనున్నాయి. నాలుగు వేదికల్లో ఆసియా కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. పాక్‌లోని ముల్తాన్‌, లాహోర్‌తోపాటు శ్రీలంకలో పల్లెకెల్లె, కొలొంబో స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత్‌, పాకిస్తాన్‌, నేపాల్‌ గ్రూప్‌-ఏలో, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌ గ్రూప్‌-బిలో ఉన్నాయి. ఈ రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌-4కు అర్హత సాధిస్తాయి. వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో ప్రతి జట్టూ తమ శక్తిసామర్థ్యాలను పరీక్షించుకునేందు ఇదొక వేదికగా మార్చుకొనే అవకాశం ఉంది.

ఆసియా కప్‌-2023 కోసం శ్రీలంక జట్టు: దసున్‌ షనక (కెప్టెన్‌), కుశాల్‌ మెండిస్‌ (వైస్‌ కెప్టెన్‌), పథుమ్‌ నిస్సంక, దిముత్‌ కరుణరత్నే, కుశాల్‌ పెరీరా, చరిత్‌ అసలంక, ధనంజయ డిసిల్వ, సదీర సమరవిక్రమ, తహీశ్‌ తీక్షణ, దునిత్‌ వెల్లలగే, మతీశ పతిరణ, కసున్‌ రజిత, దుషన్‌ హేమంత, బినుర ఫెర్నాండో, ప్రమోద్‌ మదుషన్‌

Tags

Read MoreRead Less
Next Story