ASIA CUP: గిల్‌ అద్భుత శతకం వృథా

ASIA CUP: గిల్‌ అద్భుత శతకం వృథా
X
ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్‌పై బంగ్లా గెలుపు... గెలిపించినంత పని చేసిన గిల్‌..

శుభమన్‌ గిల్‌ ఒంటరి పోరాటం వృథా అయింది. ఇతర బ్యాటర్ల నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా... బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేస్తున్నా గిల్‌ ఒంటరిగా పోరాడాడు. చిరస్మరణీయ శతకంతో టీమిండియాను గెలిపించేందుకు శత విధాల ప్రయత్నించాడు. కానీ బంగ్లా పట్టుదల ముందు భారత్‌కు ఓటమి తప్పలేదు. నామమాత్రపు మ్యాచ్‌లో రోహిత్‌ సేనపై బంగ్లా విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గెలుపునకు కొద్ది దూరంలో టీమిండియా ఆగిపోయింది.


టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలో భారత బౌలర్లు వరుస షాక్‌లు ఇచ్చారు. ఆరంభం చూస్తే బంగ్లాదేశ్‌ 200 పరుగులైనా చేస్తుందా అనిపించింది. 59 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి త్వరగానే ఆలౌట్‌ అయ్యేలా కనిపించింది. కానీ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన షకిబ్‌.. హృదాయ్‌తో కలిసి ఆ జట్టును ఆదుకున్నాడు. మొదట్లో నెమ్మదిగానే ఆడిన షకీబ్‌ సమయోచితంగా ఆడాడు. షకిబ్‌ను శార్దూల్‌ బౌల్డ్‌ చేయడంతో 101 పరుగుల అయిదో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. కానీ మసూమ్‌ అహ్మద్‌ ధాటిగా ఆడడంతో బంగ్లా 250 పరుగుల మార్క్‌ దాటింది. షకిబ్‌ అల్‌ హసన్‌ (80; 85 బంతుల్లో 6×4, 3×6) పోరాడడంతో మొదట బంగ్లాదేశ్‌ 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. హృదాయ్‌ (54; 81 బంతుల్లో 5×4, 2×6), నసూమ్‌ అహ్మద్‌ (44; 45 బంతుల్లో 6×4, 1×6) రాణించారు.


266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు. రోహిత్‌ 0, తిలక్‌ వర్మ 5, రాహుల్‌ 19, ఇషాన్‌ కిషన్‌ 5, సూర్యకుమార్‌ 26, జడేజా 7 ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. మూడు ఓవర్లు తిరిగే సరిగే కెప్టెన్‌ రోహిత్‌, అరంగేట్ర ఆటగాడు తిలక్‌ వర్మ వెనుదిరిగారు. కానీ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతున్న దశలో రాహుల్‌ ఔటవ్వగా కాసేపటికే ఇషాన్‌, సూర్య, జడేజా కూడా అవుటయ్యారు. కానీ గిల్‌ అసాధారణంగా పోరాడాడు. ఏ దశలోనూ గిల్‌ రక్షణాత్మంగా ఆడలేదు. ఇతర బ్యాటర్ల నుంచి సరైన సహకారం లేకున్నా ఒంటిచేత్తో టీమిండియాను విజయం దిశగా నడిపించాడు. పట్టుదలతో ఆడిన గిల్‌ ముచ్చటైన షాట్లతో అలరించాడు. వికెట్లు పడుతూ ఉంటే.. అతడి బ్యాటింగ్‌లో దూకుడు పెరిగింది. ఏకాగ్రత కూడా. 39 ఓవర్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న గిల్‌.. రెండు ఫోర్లు కూడా కొట్టాడు. 43 ఓవర్లు పూర్తయ్యేసరికి స్కోరు 202/6. ఆ తర్వాత మెహదీ హసన్‌ బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్స్‌ కొట్టిన గిల్‌.. మరోవైపు అక్షర్‌ నిలవగా.. భారత్‌ను విజయతీరాలకు చేర్చేలా కనపించాడు. కానీ అదే ఓవర్లో ఔటయ్యాడు.

గెలవాలంటే చివరి ఏడు ఓవర్లలో భారత్‌ 64 పరుగులు చేయాల్సిన పరిస్థితి. బంగ్లా అవకాశాలు మెరుగ్గా ఉన్న దశ అది. అయితే చక్కగా బ్యాటింగ్‌ చేసిన అక్షర్‌.. శార్దూల్‌తో కలిసి జట్టును గెలిపించేట్లే కనిపించాడు. 48వ ఓవర్లో అతడు 4, 6 బాదడంతో చివరి రెండు ఓవర్లలో 17 పరుగులు అవసరమయ్యాయి. కానీ 49వ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన ముస్తాఫిజుర్‌.. 5 పరుగులే ఇచ్చి శార్దూల్‌, అక్షర్‌లు ఇద్దరినీ ఔట్‌ చేసి భారత్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. ఆఖరి ఓవర్లో తంజిమ్‌ ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. అయిదో బంతికి షమి రనౌటవడంతో ఇన్నింగ్స్‌ ముగిసింది.

Tags

Next Story