ASIA CUP: ఆసియా కప్‌లో చరిత్ర సృష్టించిన అభిషేక్

ఆసియా కప్‌లో సంచలన ప్రదర్శన చేస్తున్న టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డును నెలకొల్పాడు. టీ20 ఆసియా కప్ ఎడిషన్‌లో 300 పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా ఘనత సాధించాడు. మొత్తంగా 6 మ్యాచ్‌ల్లో 309 రన్స్ చేశాడు. ఇంతకుముందు పాకిస్తాన్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ 2022లో 281 రన్స్ చేశాడు. తాజాగా అభిషేక్ అతన్ని వెనక్కినెట్టి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలాగే, ఓ టీ20 టోర్నీ లేదా సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో అభిషేక్ 5వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్(331, వెస్టిండీస్‌పై) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక, టీ20 ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ, అఫ్గాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ చెరో 196 రన్స్‌తో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. అలాగే, ఇప్పటికే వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాదిన అభిషేక్ శ్రీలంకపై మూడో అర్ధ శతకం నమోదు చేశాడు.
తొలిసారి దాయాదితో ఫైనల్ ఫైట్
ఆసియా కప్‌లో తుదిపోరులో దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సెప్టెంబర్ 28వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. 41 ఏళ్ల ఆసియాకప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. గ్రూప్ దశలో దాయాది పాకిస్థాన్‌పై వరుసగా రెండు విజయాలు సాధించిన భారత్.. అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. చివరి మ్యాచ్‌లో బంగ్లాపై విక్టరీ కొట్టిన పాక్.. పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
సూర్య మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత
ఆసియా కప్‌లో భాగంగా గ్రూప్ స్టేజిలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై పీసీబీ ఫిర్యాదు చేసింది. దీంతో ఐసీసీ.. సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధిస్తూ చర్యలు తీసుకుంది. సెప్టెంబర్ 14న మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. టీమ్ఇండియా పాకిస్థాన్‌పై సాధించిన విజయాన్ని ఫహల్గాం ఉగ్రదాడి బాధితులు, భారత సైనికులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. అయితే అతడు మ్యాచ్‌లో రాజకీయ ప్రసంగాలు చేశాడని ఆరోపిస్తూ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఐసీసీ ఈ చర్యలు తీసుకుంది. సూర్యకుమార్ యాదవ్‌ను ఐసీసీ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ విచారించారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను సూర్య ఖండించాడు. టోర్నీలో ఇకపై రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయొద్దని ఐసీసీ అతడికి సూచించింది. అలాగే క్రికెట్ మైదానంలో అనుచితంగా ప్రవర్తించినందుకు పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్‌కు కూడా మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాను ఐసీసీ విధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com