ASIA CUP: రక్తం-క్రికెట్ కలిసి ఎలా సాగగలవ్ !

ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌పై తీవ్ర వివాదం చెలరేగింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశంతో క్రికెట్ ఆడవద్దంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఈ మ్యాచ్ రద్దు చేయాలంటూ కొందరు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దేశంలోని క్రికెట్ అభిమానులు సైతం ఈ మ్యాచ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు అమరులయ్యారు. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది.
నెటిజన్ల ప్రశ్నలు
శత్రుదేశం పాక్ కాల్పుల్లో మన దేశానికి చెందని 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అమరవీరుల కుటుంబాల కళ్లు చెమ్మ ఆరలేదు. అంతలోనే శత్రువుతో మ్యాచ్ ఆడటం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం కావడం సహజం. గతంలో ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి సాగలేవని, రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని ప్రధాన మంత్రి మోడీ చెప్పిన మాటలను నెటిజన్లు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఆ మాటలు ఏమయ్యాయని.. రక్తం, క్రికెట్ ఎలా కలిసి సాగగలవని ప్రభుత్వం, బీసీసీఐని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. తాజా పరిస్థితుల్లో సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరగబోయే భారత్ – పాక్ ఆసియా కప్ మ్యాచ్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
పంజాబ్ కింగ్స్ పోస్ట్
ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ తనదైన శైలిలో నిరసన తెలిపి ఈ చర్చను మరింతగా వేడెక్కించింది. ఎల్లుండి జరగనున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు సంబంధించి పంజాబ్ కింగ్స్ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టింది. భారత తదుపరి మ్యాచ్ అంటూ షేర్ చేసిన గ్రాఫిక్‌లో ప్రత్యర్థి జట్టు అయిన పాకిస్థాన్ పేరును ఎక్కడా ప్రస్తావించకుండా ఖాళీగా వదిలేసింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వడంతో, నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో పంజాబ్ కింగ్స్ తమ ‘ఎక్స్’ ఖాతాలో కామెంట్స్ సెక్షన్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. మరోవైపు, ఈ మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. "దేశాల మధ్య క్రికెట్ స్నేహాన్ని, సామరస్యాన్ని పెంచాలి. కానీ పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ లాంటి ఘటనల తర్వాత మన సైనికులు ప్రాణత్యాగాలు చేస్తుంటే, ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న దేశంతో క్రీడల పేరుతో సంబరాలు చేసుకోవడం సరికాదు" అని పిటిషనర్లు తమ పిటిషన్లో పేర్కొన్నారు.
ఐపీఎల్ ఛైర్మన్ కీలక ప్రకటన
భారత్-పాక్ మ్యాచ్‌పై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఓ కీలక ప్రకటన చేశారు. అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. " ఆసియా కప్ కోసం భారత జట్టుకు నా శుభాకాంక్షలు. ద్వైపాక్షిక మ్యాచ్‌ల విషయంలో పాకిస్తాన్‌తో ఆడబోమని ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేసింది. అయితే ఏసీసీ లేదా ఐసీసీ టోర్నమెంట్లు ఉన్నప్పుడు మనం వాటిలో పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే మనం ప్రభుత్వం సలహా మేరకు నడుచుకుంటాం" అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com