ASIA CUP: హైడ్రామా నడుమ సూపర్-4కు పాకిస్థాన్

ఆసియా కప్‌లో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచులో పాకిస్థాన్ తడబడి నిలిచింది. పసికూన యూఏఈతో జరిగిన మ్యాచులో పాక్ 41 పరుగుల తేడాతో గెలిచింది. గ్రూప్-ఎ నుంచి భారత్ ఇప్పటికే సూపర్-4కు చేరగా.. రెండో బెర్తు కోసం పాక్, యూఏఈల మధ్య పోటీ నెలకొంది. చివరి మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారికే సూపర్-4లో చోటు. ఈ స్థితిలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. 9 వికెట్లకు 146 పరుగులే చేయగలిగింది. సంచలన రీతిలో బౌలింగ్ చేసిన జునైద్ సిద్ధిఖ్ (4/18).. ఓపెనర్లు సైమ్ అయూబ్ (0), సాహిబ్జాదా ఫర్హాన్ (5)లను వరుస ఓవర్లలో ఔట్ చేయడంతో పాక్ 9/2తో కష్టాల్లో పడింది.
ఆదుకున్న ఫకార్ జమాన్
ఈ దశలో ఫకార్ జమాన్ (50; 36 బంతుల్లో 2×4, 3×6), సల్మాన్ అఘా (20) పట్టుదలతో క్రీజులో నిలిచి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కానీ వీళ్లిద్దరూ ఔటయ్యాక పాక్ మళ్లీ తడబడింది. భారత సంతతి స్పిన్నర్ సిమ్రన్‌జీత్ సింగ్ (3/26) ధాటికి 93/6తో కష్టాల్లో పడింది. భారత్‌తో గత మ్యాచ్‌లో మాదిరే షహీన్ అఫ్రిది (29 నాటౌట్; 14 బంతుల్లో 3×4, 2×6) ఆఖర్లో చెలరేగి ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరునందించాడు. ఛేదనలో యూఏఈ 17.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. ఆరంభంలోనే తడబడ్డ యూఏఈ.. 37/3కు చేరుకుంది. ఈ స్థితిలో రాహుల్ చోప్రా (35), ధ్రువ్ పరాషర్ (20) ఆ జట్టులో ఆశలు రేపారు. కానీ ఈ భాగస్వామ్యం విడిపోయాక యూఏఈ నిలవలేకపోయింది. అబ్రార్ అహ్మద్ (2/13), షహీన్ అఫ్రిది (2/16), హారిస్ రవూఫ్ (2/19) ఆ జట్టును దెబ్బ తీశారు. షహీన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. షాహిన్ షా అఫ్రిది మరోసారి తన బ్యాట్‌కు పని చెప్పాడు. ఆఖరి ఓవర్లో అతను వరుసగా 6, 6, 4 బాది 18 పరుగులు పిండుకున్నాడు. దాంతో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసి గౌరవ ప్రదమైన స్కోర్ అందుకుంది. దీంతో నాలుగు పాయింట్లతో పాక్ సూపర్-4కు అర్హత సాధించగా, యూఏఈ నిష్క్రమించింది.
అనూహ్య పరిణామాలు
ఆసియా కప్‌లో భాగంగా భారత్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో ప్రత్యర్థి ఆటగాళ్లు తమతో హ్యాండ్ షేక్ చేయలేదని, అందుకు కారణమైన రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ను తొలగించాలని డిమాండ్ చేసిన పాకిస్తాన్ ఐసీసీ వెనక్కి తగ్గకపోవడాన్ని అవమానంగా భావిస్తోంది. దీంతో ఎలాగైనా నిరసన తెలపాలని నిర్ణయించింది. దీంతో యూఏఈ తో పాకిస్తాన్ జరగాల్సిన మ్యాచ్ కు ముందు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. హ్యాండ్ షేక్ వివాదానికి కారకుడైన మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ను ప్యానెల్ నుంచి తొలగించాలని, లేకపోతే తాము టోర్నీ నుంచి తప్పుకుంటామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. యూఏఈతో జరగాల్సిన మ్యాచ్ కు రిఫరీ మార్పు ఉంటుందని భావించింది. అయితే ఐసీసీ నుంచి దీనిపై క్లారిటీ రాకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బెదిరింపులకు దిగింది. మ్యాచ్ కు పాక్ ఆటగాళ్లు చివరి నిమిషం వరకూ హాజరు కాకుండా హోటల్ రూమ్ లోనే ఉండిపోయారు. చివరికి ఐసీసీ ఒత్తిడితో పాక్ బరిలోకి దిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com