ASIA cup: యూఏఈపై టీమిండియా ఘన విజయం

ఆసియా కప్ 2025 టోర్నీని భారత్ ఘనంగా ప్రారంభించింది. పసికూన యూఏఈతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ముందుగా బౌలింగ్‌లో నిప్పులు చెరిగిన భారత్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో బౌండరీల మోత మోగించింది. టీ20ల్లో వరల్డ్ ఛాంపియన్ అయిన భారత్‌కు యూఏఈ కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది.
చెలరేగిన కుల్దీప్, దూబే
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈకి ఆదిలోనే షాక్ తగిలింది. దూకుడుగా ఆడుతున్న అలిషామ్ను జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేశాడు. ఆ వెంటనే ముహమ్మద్ జోహైబ్ (2), రాహుల్ చోప్రా (3)లను వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చారు. వసీమ్‌ను కుల్దీప్ బుట్టలో వేశాడు. ఆపై శువం దూబే విరుచుకుపడ్డాడు. భారత బౌలర్ల దెబ్బకు యూఏఈ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. అందరూ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో యూఏఈ స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దెబ్బకు 13.1 ఓవర్లలో 57 పరుగులకే యూఏఈ కుప్పకూలింది. ఓపెనర్లు అలిషామ్ స్కార్ఫ్ (22), ముహమ్మద్ వసీమ్ (19) టాప్ స్కోరర్లు. మిగతా యూఏఈ బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 3 కంటే ఎక్కువ పరుగులు ఎవరూ చేయకపోవడం విశేషం. కుల్దీప్ 4, శివమ్ 3 వికెట్లు తీయగా.. బుమ్రా, అక్షర్, వరుణ్ తలో ఒక్కో వికెట్ పడగొట్టారు.
అభిషేక్ శర్మ, గిల్ విధ్వంసం..
భారత్ 4.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30), శుభ్‌మన్ గిల్(9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(2 బంతుల్లో సిక్స్‌తో 7 నాటౌట్) మెరుపులు మెరిపించారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖి ఒక వికెట్ తీసాడు. అభిషేక్, గిల్ ధాటికి 93 బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాన్ని చేధించింది. 58 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ భారీ సిక్స్ తో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. హైదర్ అలీ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే స్టేడియం బయటకు పంపించాడు. ఆ మరుసటి బంతిని బౌండరీ తరలించాడు. ఆ తర్వాతి నాలుగు బంతులు డాట్ కావడంతో తొలి ఓవర్లోనే 10 పరుగులు వచ్చాయి. రెండో ఓవర్లో గిల్ ఓ బౌండరీతో పాటు సిక్సర్ బాదాడు. అభిషేక్ శర్మ వరుసగా 6, 4 బాదడంతో టీమిండియా 3 ఓవర్లలోనే 38 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు నమోదైన 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఎదుర్కొన్న తొలి బంతినే భారీ సిక్సర్‌గా మలిచాడు. ఐదో ఓవర్ మూడో బంతిని గిల్ బౌండరీ బాది భారత విజయాలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ విజయంతో పాక్‌తో జరగబోయే మ్యాచ్‌కు భారత్ ఆత్మ విశ్వాసం ప్రోది చేసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com