ASIA CUP: నేడే దాయాదుల మధ్య తుది సమరం

ఆసియా కప్‌నకు 41 ఏళ్ల చరిత్ర ఉంది. కానీ ఇప్పటివరకూ ఇందులో భారత్-పాక్ ఫైనల్లో తలపడలేదు. కానీ తొలిసారి భారత్ - పాకిస్థాన్ ఫైనల్లో తలపడుతున్నాయి. ఇప్పటికి ఎనిమిదిసార్లు భారత్ ఛాంపియన్‌గా నిలవగా.. పాకిస్థాన్ కేవలం రెండుసార్లే విజేతగా మారింది. ప్రస్తుత ఆసియా కప్ ఫైనల్లోనూ టీమ్ఇండియానే ఫేవరెట్. కానీ, గతంలో యూఏఈలో ‘ఫైనల్’ మ్యాచుల ఫలితాలను చూస్తే కాస్త ఆందోళనకరమే. మరీ ముఖ్యంగా పాకిస్థాన్‌తో ఐసీసీ టోర్నీల్లో యూఏఈ గడ్డపై ఆడిన ఫైనల్ మ్యాచుల్లో భారత్‌కు పెద్దగా కలిసిరాలేదు. అలాగే ఓవరాల్‌గా ఇరు జట్లూ 10 ఫైనల్స్‌లో తలపడితే.. టీమ్ఇండియా కేవలం మూడుసార్లే విజయం సాధించింది.
ఆధిపత్యం మనదే
1984లో తొలిసారి ఆసియాకప్ టోర్నీ జరిగింది. తొలి ఎడిషన్‌లో కేవలం మూడు జట్లు మాత్రమే పాల్గొన్నాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 8కి చేరింది. 1984 నుంచి 2023 వరకు 16 ఎడిషన్లు జరిగాయి. అందులో భారత జట్టే ఆధిపత్యం ప్రదర్శించింది. ఏకంగా 8 సార్లు విజేతగా నిలిచింది. ఆ తర్వాత శ్రీలంక 6 సార్లు, పాకిస్థాన్ రెండు సార్లు విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్ మూడు సార్లు ఫైనల్ చేరినా.. రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. పాకిస్థాన్ కూడా 2000, 2012లో టైటిల్ సాధించింది. కానీ అప్పుడు ఆ జట్టు ఇతర జట్లతోనే ఫైనల్ మ్యాచ్ ఆడింది. కానీ ఈసారి మాత్రం తొలిసారి ఆసియాకప్ ఫైనల్లో దాయాదుల పోరును చూడబోతున్నాం.
తుది పోరుకు టీమిండియా సిద్ధం
ఆసియా కప్ 2025 టోర్నీలో వరుస విజయాలతో దుమ్మురేపుతున్న టీమిండియా తుది పోరుకు సిద్దమైంది. ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన సూర్య సేన.. ఆదివారం జరిగే ఫైనల్లో దాయాదీ పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో ఇప్పటికే వరుసగా 6 విజయాలు సాధించిన టీమిండియా అదే జోరులో పాకిస్థాన్‌ను మట్టికరిపించి టైటిల్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఈ టోర్నీలో రెండు సార్లు పాకిస్థాన్‌ను భారత్ మట్టికరిపించింది. లీగ్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్.. సూపర్-4 మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ తేలిపోయింది. కనీసం ఫైనల్లో అయినా పోటీ ఇస్తుందా? లేక ఓటమికి తల వంచుతుందా? అనేది చూడాలి. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలోనే భారత్, పాకిస్థాన్ తొలిసారి ఫైనల్ ఆడుతున్నాయి.
రెండు మార్పులతో టీమిండియా..
లీగ్, సూపర్ 4 దశలో పాకిస్థాన్ చిత్తయినా ఆ జట్టును ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. సూపర్-4లో బంగ్లాదేశ్, శ్రీలంకను ఓడించి ఫైనల్‌కు చేరింది. అదే జోరులో భారత్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో పాకిస్థాన్ ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌ను టీమిండియా ఏ మాత్రం లైట్ తీస్కోదు. శ్రీలంకతో సూపర్-4 మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా.. ఫైనల్‌కు ముందు జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబేలకు రెస్ట్ ఇచ్చింది. పాకిస్థాన్‌తో ఫైనల్లో ఈ ఇద్దరూ తిరిగి బరిలోకి దిగనున్నారు. పాండ్యా గాయం కూడా టీమిండియాను కలవరపెడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com