T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!

T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!
X
కంగారులపై శ్రీలంక అద్భుత విజయం

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌లో శ్రీలంక జట్టు అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. శ్రీలంకలోని పల్లకీల మైదానంలో జరిగిన ఈ పోరులో లంకా ఆటగాళ్లు సమష్టిగా రాణించి కీలక విజయాన్ని నమోదు చేశారు. ఈ ఫలితంతో ఆస్ట్రేలియా సూపర్-8 దశకు చేరుకోవడం కష్టంగా మారింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (54), ట్రావిస్ హెడ్ (56) హాఫ్ సెంచరీలతో జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశారు. జోష్ ఇంగ్లిస్ (27), గ్లెన్ మాక్స్‌వెల్ (22) పరవాలేదనిపించినా, కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్ వంటి కీలక ఆటగాళ్లు విఫలమయ్యారు. చివరి ఓవర్‌లో రెండు రనౌట్లతో పాటు మొత్తం మూడు వికెట్లు కోల్పోవడం ఆసీస్ స్కోరును పరిమితం చేసింది. శ్రీలంక బౌలర్లలో దుషాన్ హేమంత మూడు వికెట్లు తీసి మెరిపించగా, చమీర, తీక్షణ, దునిత్, మెండిస్ తలో వికెట్ దక్కించుకున్నారు.

లక్ష్య ఛేదనలో శ్రీలంక అద్భుతంగా ఆడింది. పాతుమ్ నిశాంక కేవలం 52 బంతుల్లో 100 పరుగులు చేసి మ్యాచ్‌ను ఒక్కరే తేల్చేశాడు. ఆయన ఇన్నింగ్స్‌లో పది ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉండటం విశేషం. కుషాల్ మెండిస్ 51 పరుగులతో బలమైన మద్దతు అందించాడు. ఆసీస్ బౌలర్లలో మార్కస్ స్టోయినిస్ మాత్రమే రెండు వికెట్లు తీశాడు; మిగతావారు ప్రభావం చూపలేకపోయారు. మొత్తం మీద ఈ విజయం శ్రీలంకకు ఉత్సాహాన్ని పెంచగా, ఆస్ట్రేలియాకు మాత్రం టోర్నీలో గట్టి దెబ్బ తగిలింది.

Tags

Next Story