Eng vs Aus: రాణించిన స్మిత్, 15 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఆస్ట్రేలియా

Ashes 5th Tes Cricket: యాషెస్ సిరీస్‌లోని చివరిదైన 5వ టెస్ట్‌లో 2వ రోజు ఆస్ట్రేలియా జట్టు 15 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. ఆట ముగిసే సమయానికి 295 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ 71 పరుగులతో రాణించాడు.
మొదటి రోజు వికెట్ కోల్పోయి 61 పరుగులు చేసిన ఆస్ట్రేలియా జట్టు 2వ రోజు ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా మొదలు పెట్టింది. మార్నస్ లబుషేన్(9), ఉస్మాన్ ఖవాజాలు మొదటి గంట ఆటలో కేవలం 13 పరుగులు మాత్రమే చేశారు. 82 బంతులు ఆడిన లబుషేన్ కేవలం 9 పరుగులే చేశాడు. మార్క్ వుడ్ బౌలింగ్‌లో స్లిప్‌లో బెన్‌స్టోక్స్ చూడచక్కని క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. స్టీవ్ స్మిత్ రాకతో స్కోర్‌బోర్డ్‌లో కొద్దిగా కదలిక వచ్చింది. ఒకానొక దశలో భారీ ఆధిక్యం దిశగా కదిలిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది.
క్రీజులో కుదురుకున్న ఖవాజా(47)ను స్టువర్ట్ బ్రాడ్ స్లో డెలివరీతో బోల్తా కొట్టించడంతో ఎల్బీగా వెనుదిరిగాడు. బ్రాడ్ తన తరువాతి ఓవర్లోనే ట్రావిస్ హెడ్(4) వికెట్ పడగొట్టాడు. తర్వాత వచ్చిన మార్ష్(16) ఒక సిక్స్, ఫోర్‌తో పరుగుల వేగం పెంచే ప్రయత్నం చేసినా ఆండర్సన్ బౌలింగ్‌లో 151 పరుగుల వద్ద బౌల్డయ్యాడు. అలెక్స్ కారే(10) 170 పరుగుల వద్ద 6వ వికెట్‌గా క్యాచౌటయ్యాడు. మరో 15 పరుగులు చేసిన తర్వాత స్టార్క్ వికెట్ కోల్పోయింది. దీంతో 185 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
కమిన్స్-స్మిత్ విలువైన భాగస్వామ్యం..
క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కమిన్స్(36), స్టీవ్ స్మిత్‌తో కలిసి 54 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో స్మిత్ 98 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ధాటిగా ఆడుతున్న ఈ జోడీని క్రిస్ వోక్స్ స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేసి విడగొట్టాడు. తర్వాత వచ్చిన మర్ఫీ ఎడాపెడా బౌండరీలు బాదడంతో స్కోర్ 280 దాటింది. 34 పరుగులు చేసిన మర్ఫీని వోక్స్ పెవిలియన్ పంపాడు. 295 పరుగుల వద్ద భారీ షాట్‌కు యత్నించిన కమిన్స్ బౌండరీ లైన్ వద్ద స్టోక్స్ పట్టిన అద్భుత క్యాచ్‌తో చివరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3 వికెట్లు పడగొట్టగా, బ్రాడ్, వుడ్, రూట్‌లు చెరీ 2 వికెట్లు, ఆండర్సన్ 1 వికెట్ తీశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com