BGT: భారత్‌ను కంగారెత్తించి... విజయం సాధించి...

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టుకు ఘోరపరాభవం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన ఏకంగా 184 పరుగుల తేడాతో చిత్తయ్యింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సాధించింది. ఆఖరిదైన సిడ్నీ టెస్టు జనవరి 3 నుంచి జరుగుతుంది. 340 పరుగుల ఛేదనలో ఆఖరి రోజు బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 155 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (84), పంత్ (30) నాలుగో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. వీరిద్దరు మినహా మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కమిన్స్, బోలాండ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. లియోన్ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు ఆసీస్ ఆఖరి రోజు పది బంతులే ఆడి రెండో ఇన్నింగ్స్‌ను 234 పరుగుల వద్ద ముగించింది. బుమ్రాకు 5, సిరాజ్‌కు 3 వికెట్లు లభించాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 474, భారత్ 369 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
జైస్వాల్ ఒక్కడే..
భారీ ఛేదనలో మూడు సెషన్ల ఆట ఉండడంతో డ్రా కోసమైనా భారత ఆటగాళ్లు పోరాడతారనిపించింది. కానీ జైస్వాల్-పంత్ భాగస్వామ్యం మినహా చెప్పుకోవడానికేమీ లేకపోయింది. కెప్టెన్ రోహిత్ (9), విరాట్ కోహ్లీ (5) తక్కువ పరుగులకే అవుటయ్యారు. తన సహజశైలిని పక్కనబెట్టి వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అటు జైస్వాల్ అర్ధసెంచరీని పూర్తి చేసుకోవడంతో ఈ సెషన్‌ను జట్టు 112/3తో ముగించింది. ఆఖరి సెషన్‌లో మరో 38 ఓవర్ల ఆట మిగిలి ఉండగా చేతిలో 7 వికెట్లున్నాయి. ఈ దశలో డ్రా ఖాయమనిపించింది. కానీ ఇలాంటి కీలక స్థితిలో పంత్ నిర్లక్ష్యపు షాట్ కొంపముం చింది. హెడ్ ఓవర్‌లో భారీ షాట్ ఆడిన పంత్ బౌండరీ లైన్ వద్ద మార్ష్‌కు చిక్కాడు. అంతే.. ఈ వికెట్ తర్వాత ఆసీస్ బౌలర్లు ఒకరి తర్వాత మరొకరిని పెవిలియన్‌కు క్యూ కట్టించారు.
వివాదాస్పదంగా మారిన జైస్వాల్ ఔట్!
మెల్‌బోర్న్ టెస్టులో మరో వివాదం రేగింది. రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (84) ఔటైన తీరు తీవ్ర చర్చకు దారితీసింది. పాట్ కమిన్స్ వేసిన బంతిని ఆడేందుకు యశస్వి ప్రయత్నించగా అది మిసై నేరుగా కీపర్ చేతిలో పడింది. ఆసీస్ అప్పీలు చేసినా.. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో వెంటనే కమిన్స్ DRS తీసుకోగా థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చేశాడు. స్నికో మీటర్‌లో ఎలాంటి స్పైక్ రాకపోయినా ఔటివ్వడం వివాదాస్పదంగా మారింది.
ఓటమిపై స్పందించిన రోహిత్ శర్మ
మెల్‌బోర్న్ వేదికగా ఆసీస్‌తో జరిగిన టెస్టులో భారత్ ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ‘మంచి ఆరంభం ఇవ్వాలని మాత్రం భావించాం. గతంలోనూ ఇలాంటి మ్యాచుల్లో విజయం సాధించాం. దురదృష్టవశాత్తూ పంత్ ఔటైన తర్వాత మ్యాచ్ మరింత సంక్లిష్టంగా మారింది. ఆస్ట్రేలియా సరైన సమయంలో మంచి బౌలింగ్ వేసింది. ఈ మ్యాచ్ ఓటమిని పక్కన పెట్టి సిడ్నీ టెస్టు కోసం సిద్ధమవుతాం’ అని స్పష్టం చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com