Aus vs Ban: అప్పుడు విండీస్, ఇప్పుడు బంగ్లా..ఆ జట్ల జాబితాలో ఆసీస్..!

Australia Vs Bangladesh: ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బంగ్లా పర్యటనకు వచ్చిన ఆసీస్ చిత్తుగా ఓడిపోయింది. ఐదు టీ20ల్లో కేవలం ఒక్క మ్యాచులో మాత్రమే విజయం సాధించింది. సోమవారం రాత్రి జరిగిన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కేవలం 62 పరుగులకే కుప్పకూలింది. 60 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించిన బంగ్లా సిరీస్‌ను 4–1తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగుల చేసింది. ఓపెనర్ మొహమ్మద్ నైమ్ (23 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
లక్ష్యచేధనలో ఆ్రస్టేలియా 13.4 ఓవర్లలో 62 పరుగులకే కుప్పకూలిపోయింది. తాత్కాలిక సారథి వేడ్ (22 బంతుల్లో 22; 2 సిక్స్‌లు), బెన్ మెక్‌డెర్మట్ (16 బంతుల్లో 17; 1 సిక్స్) మినహా మిగతా తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. బంగ్లాబౌలర్లలో షకీబుల్ హసన్ 4, సైఫుద్దీన్ 3 వికెట్లు పడగొట్టారు. సిరీస్‌లో ఏడు వికెట్లతో పాటు 114 పరుగులు చేసిన షకీబ్‌కు, 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' తోపాటు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌తో షకీబుల్ హసన్ టి20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ బౌలర్ లసిత్ మలింగ (107) అగ్రస్థానంలో ఉన్నాడు.
అయితే సీనియర్ల గైర్హాజరీలో అంతగా అనుభవం లేని జట్టుతో ఆస్ట్రేలియా- బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చింది. ఇక ఈ మ్యాచ్ ఓటమితో పరిమిత ఓవర్ల మ్యాచ్ లో టి20, వన్డేల్లో ఆ్రస్టేలియాకిదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఈ మ్యాచ్ ముందువరకు కూడా 2005లో వన్డేలో ఇంగ్లండ్‌పై చేసిన 79 పరుగులు అత్యల్ప స్కోరుగా ఉంది. టి20ల్లో ఆసీస్‌కు ఇది వరుసగా రెండో సిరీస్ ఓటమి. గత నెలలో విండీస్ చేతిలో ఆస్ట్రేలియా 1–4తో ఓడింది.
బలమైన లంక జట్టు కీలక ఆటగాళ్ల నిష్క్రమణ తర్వాత ఘోరంగా తయారైంది. టీమిండియా టూర్ లో కీలక ఆటగాళ్లు దూరం కావడంతో భారత్ పై విజయం సాధించింది. లేదంటే శ్రీలంక పరిస్థితి మరోలా ఉండేదని క్రీడా పండితుల అభిప్రాయం. ఇక టీ20ల్లో పాక్ పరిస్థితి అలానే తయారైంది. బలమైన జట్లపై ఘోరంగా విఫలం కావడం, జింబాంబ్వే వంటి జట్లపై విజయం సాధించడం ఆ జట్టుకు అలవాటైయింది. ఇప్పుడు ఆసీస్ పరిస్థితి చూస్తే అలానే కనిపిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com