Australian Open: ఫైనల్ కు చేరిన సానియా-బోపన్న జోడీ

తన కెరీర్ లోనే ఆఖరి గ్రాండ్ స్లామ్ ఆడుతున్న సానియా మిర్జా ఏడవ టైటిల్ గెలుచుకునేందుకు ఇంకా ఒక్క అడుగు దూరంలోనే ఉంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టోర్నమెంట్ లో రోహన్ బోపన్నతో కలసి ఫైనల్స్ కు చేరుకుంది.
మెల్బోర్న్ లో జరిగిన మ్యాచ్ లో అన్ సీడెడ్ గా బరిలోకి దిగిన సానియా-బోపన్న జోడీ, 3వ సీడెడ్ స్థాయిల ో ఉన్న డిజైరే క్రౌజిక్, నీల్ స్కూప్స్కీ జోడీపై 7-6(5) 6-7(5) 10-6 తేడాతో విజయకేతనం ఎగరవేసింది. సుమారు గంటా 52 నిమిషాల పాటూ సాగిన సెమీఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిందనే చెప్పాలి.
ఇక మ్యాచ్ అనంతరం మీడియాతో ముచ్చటించిన సానియా ఇది తన ఆఖరి గ్రాండ్ స్లామ్ అని, అందుకే ఈ మ్యాచ్ అత్యంత ప్రత్యేకమని వెల్లడించింది. అందులోనూ 18ఏళ్ల క్రితం రోహన్ బోపన్నతో ఇదే స్టేడియంలో తొలి మ్యాచ్ ఆడినట్లు గుర్తుచేసుకుంది. అప్పుడు తన వయసు 14 కాగా, ఇప్పుడు తాను 36, బోపన్న 42కు చేరువయ్యామని తెలిపింది. అయినా ఇప్పటికీ ఎంతో ఉత్సాహంగా ఆడుతున్నామని సంతోషం వ్యక్తం చేసింది. తామిద్దరి మధ్యా మంచి అనుబంధం ఉందని వెల్లడించింది. ఫిబ్రవరిలో దుబాయ్ లో జరగనున్న WTA తన ఆఖరి మ్యాచ్ కాబోతోందని స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com