Babar Azam: బాబర్‌ అజామ్‌ సంచలన నిర్ణయం

Babar Azam: బాబర్‌ అజామ్‌ సంచలన నిర్ణయం
పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటన

పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం సంచలన ప్రకటన చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ఇదే విషయాన్ని గత నెలలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలియజేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు. కెప్టెన్సీ చక్కటి అనుభవమని, అయితే తనపై ప్రతికూల ప్రభావం పడుతోందని బాబర్ చెప్పాడు. కెప్టెన్‌గా వైదొలగి తన ప్రదర్శనపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టు అతడు వివరించాడు.

‘‘ పాక్ జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకొని నా వ్యక్తిగత పాత్రపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. కెప్టెన్సీ అనేది ఒక చక్కటి అనుభవం. అయితే భారాన్ని పెంచింది. నా ప్రదర్శనకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను. నా బ్యాటింగ్‌ను ఆస్వాదించాలనుకుంటున్నాను. నా కుటుంబంతో మంచిగా సమయం గడపాలని భావిస్తున్నాను. ఈ విషయాలు నాకు ఆనందం కలిగిస్తాయి’’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో బాబర్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో బాబర్‌ను కెప్టెన్‌గా పీసీబీ నియమించింది. ఆ తర్వాత 4 టీ20 సిరీస్‌లకు నాయకత్వం వహించాడు. ఇక బాబర్ 85 టీ20 మ్యాచ్‌ల్లో పాక్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 48 విజయాలతో పాక్ క్రికెట్ చరిత్రలో రెండవ అత్యంత విజయవంతమైన టీ20 కెప్టెన్‌గా నిలిచాడు. ఇక బాబర్ ఆధ్వర్యంలో పాక్ 43 వన్డే మ్యాచ్‌లు ఆడగా అందులో 26 మ్యాచ్‌లను గెలుచుకుంది.

2023 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన చేయడంతో బాబర్‌ అజామ్‌ను పీసీబీ కెప్టెన్సీ నుంచి తప్పించింది. టీ20లకు షహీన్‌ అఫ్రిదిని, టెస్టులకు షాన్‌ మసూద్‌ను కెప్టెన్‌గా నియమించింది. అయితే అఫ్రిది నేతృత్వంలో న్యూజిలాండ్‌పై 4-1 తేడాతో సిరీస్ కోల్పోవడంతో మళ్లీ బాబర్‌కే బాధ్యతలు వచ్చాయి. బాబర్‌ నేతృత్వంలో టీ20 ప్రపంచకప్‌ 2024 ఆడిన పాక్.. ఘోర ప్రదర్శన చేసింది. భారత్‌తో సహా పసికూన యూఎస్‌ఏ చేతిలో ఓడిపోయింది. దీంతో కెప్టెన్‌ సహా జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వ్యక్తిగతంగా గొప్ప ప్రదర్శనలు చేసిన బాబర్‌.. ఐసీసీ టోర్నీలను మాత్రం గెలవలేకపోయాడు. బాబర్‌ ఇప్పటివరకు 54 టెస్టు మ్యాచ్‌ల్లో 3962 పరుగులు, 117 వన్డేల్లో 5729 పరుగులు, 123 టీ20ల్లో 4145 పరుగులు చేశాడు.

Tags

Next Story