ASIA CUP: పాక్‌ బ్యాట్ మెన్లపై విరుచుకుపడిన పాక్ బౌలర్లు

ASIA CUP: పాక్‌ బ్యాట్ మెన్లపై  విరుచుకుపడిన పాక్ బౌలర్లు
పసికూన నేపాల్‌పై పాకిస్థాన్‌ ఘన విజయం.... బాబర్‌ ఆజమ్‌-ఇఫ్తికార్‌ అహ్మద్‌ విధ్వంసం..

ఆసియా కప్‌ 2023(Asia cup) ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్‌(pakisthan) అదరగొట్టింది. పసికూన నేపాల్‌(Nepal )పై భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ముల్తాన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 238 పరుగుల భారీ తేడాతో పాక్‌ ఘన విజయం( 238-run victory) సాధించింది. మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. బాబర్‌ ఆజమ్‌(Babar Azam), ఇఫ్తికార్‌ అహ్మద్‌( Iftikhar Ahmed) నేపాలీ బౌలర్లను ఊచకోత కోశారు. బాబర్‌ 131 బంతుల్లోనే 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 151 పరుగులు చేయగా... ఇఫ్తికార్‌ అహ్మద్‌ 71 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 109 పరుగులతో అజేయంగా నిలిచాడు. వన్డేల్లో పాక్‌ తరఫున ఐదో వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా బాసిత్‌ అలీ (67 బంతుల్లో) రికార్డును ఇఫ్తికార్‌ సమం చేశాడు.


ఈ ఇద్దరు బ్యాటర్లు శతకాలతో విరుచుకుపడగా.. మహ్మద్‌ రిజ్వాన్‌ 44 పరుగులతో రాణించాడు. బాబర్ అజామ్‌-ఇఫ్తికార్‌ అహ్మద్‌ జోడి ఐదో వికెట్‌కు 214 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇప్పటివరకు జరిగిన ఆసియా కప్‌లో ఏ వికెట్‌కైనా మూడో అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం విశేషం. ఆసియా కప్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా బాబర్ అజామ్‌ రికార్డు నెలకొల్పాడు. ఫకర్‌ జమాన్‌ (14), ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (5), అఘా సల్మాన్‌ (5) విఫలమయ్యారు. నేపాల్‌ బౌలర్లలో సోంపాల్‌ కామీ 2 వికెట్లు పడగొట్టగా.. కరణ్‌ , సందీప్‌ లామిచ్చేన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. ఇమామ్‌ ఉల్‌ హాక్‌, రిజ్వాన్‌ రనౌట్లయ్యారు.


తొలిసారి ఆసియా కప్‌ ఆడుతున్న నేపాల్.. లక్ష్య ఛేదనలో పాక్ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. 343 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన నేపాల్‌ బ్యాటర్లు సగం ఓవర్లు కూడా ఆడలేకపోయారు. పాక్‌ బౌలర్ల ధాటికి విలవిల్లాడి 23.4 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. షాదాబ్‌ ఖాన్‌ (4/27)(Shadab Khan ) నేపాల్‌ పతనాన్ని శాసించగా.. షాహీన్‌ అఫ్రిది, హరీస్‌ రౌఫ్‌ చెరో 2 వికెట్లు.. నసీం షా, నవాజ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. నేపాల్‌ ఇన్నింగ్స్‌లో ఆరిఫ్‌ షేక్‌ (26), సోంపాల్‌ కామీ (28), గుల్సన్‌ షా (13) రెండంకెల స్కోర్లు చేయగా మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story