ipl: కుల్‌దీప్‌పై నిషేధం తప్పదా..?

ఐపీఎల్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకూ మ్యాచులు ఉత్కంఠభరితంగా సాగుతుండగా ఇప్పుడు ఒక్క చెంప దెబ్బ ఐపీఎల్ లో వేడిని రాజేసింది. ఇప్పుడు ఆట కంటే ఇతర విషయాలే హైలైట్ అయింది. దేశం తరఫున కలసి ఆడే ఆటగాళ్లు కూడా ఫ్రాంచైజీల తరఫున ఆడేటప్పుడు బద్ద శత్రువులుగా మారిన ఘటనలూ అనేకం గతంలోనూ చూశాం. తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది. దోస్తుల మధ్య కూడా రసవత్తర పోరు జరుగుతూ ఉంటుంది. బూతులు తిట్టుకోవడమే గాక ఒక్కోసారి ప్లేయర్లు ఒకరిపై ఒకరు దూసుకెళ్లడం, కొట్టుకోవడం వరకూ వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. అప్పట్లో పేసర్ శ్రీశాంత్‌ను టర్బోనేటర్ హర్భజన్ సింగ్ చెంపదెబ్బ కొట్టిన ఘటన అప్పట్లో ఐపీఎల్ లో పెను ప్రకంపనలే సృష్టించింది. ఇప్పుడు అలాంటి ఘటనే మరొకటి జరిగింది. కోల్ కతా బ్యాటర్ రింకూ సింగ్ ను ఢిల్లీ బౌలర్ కుల్ దీప్ యాదవ్ రెండు సార్లు చెంప దెబ్బ కొట్టడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. కుల్ దీప్ ను ఐపీఎల్ నుంచి బహిష్కరించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.
అసలు ఏం జరిగింది..?
కోల్‌కతా నైట్ రైడర్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో 14 పరుగుల తేడాతో ఢిల్లీపై కోల్ కతా విజయం సాధించింది. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం రింకూ సింగ్, కుల్‌దీప్ యాదవ్ సహా కొందరు ఆటగాళ్లంతా ఒక్క చోట చేరి సరదాగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఏమైందో ఏమో.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కుల్‌దీప్ యాదవ్.. ఉన్నట్లుండి కేకేఆర్ ప్లేయర్ రింకూ సింగ్ చెప్పపై కొట్టాడు. అప్పటివరకూ సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్న రింకూ.. మొదట్లో తెలిగ్గానే తీసుకున్నాడు. కాసేపటికే మళ్లీ కుల్‌దీప్ మరోసారి చెంపదెబ్బ కొట్టాడు. దీంతో రింకూ సింగ్ ఒక్కసారిగా అసహనంగా కనిపించాడు.
నిషేధం విధిస్తారా..?
రింకూ సింగ్ చెంప చెళ్లుమనిపించిన కుల్ దీప్ ను సస్పెండ్ చేయాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. అది ఫ్రెండ్లీగా కొట్టినట్లు అనిపించట్లేదని, అహంకారంతోనే ఇలాంటి పని చేశాడని ఆరోపిస్తున్నారు. ఇది చెత్త ప్రవర్తన అని.. సీనియర్ స్పిన్నర్‌ను కొన్ని మ్యాచుల పాటు నిషేధించాలని అంటున్నారు. అప్పట్లో శ్రీశాంత్ మీద చేయిచేసుకున్నందును భజ్జీని మిగతా టోర్నీతో పాటు 5 వన్డేల పాటు బీసీసీఐ బ్యాన్ చేసిందని గుర్తు చేస్తున్నారు. కుల్దీప్‌ను కూడా ఇదే మాదిరిగా నిషేధించాలని, అప్పుడు గానీ తప్పు చేశాననే పశ్చాత్తాపం రాదని అంటున్నారు. అయితే రింకూ-కుల్దీప్ మధ్య ఏం జరిగింది.. చెంపదెబ్బ కొట్టడం వెనుక రీజన్ ఏంటి.. సరదాగానే చేయిజేసుకున్నాడా.. వేరే ఏదైనా కారణం ఉందా.. ఎవరిది తప్పు అనేది ఇద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే గానీ చెప్పలేం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com