BANGLA: బంగ్లాకు పూర్తిగా మూసుకుపోయిన దారులు

రానున్న టీ20 ప్రపంచకప్ విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్‌కు సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. భారత్ వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీకి హాజరుకావడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) వ్యక్తం చేసిన సందేహాలకు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ స్పష్టమైన తుది నిర్ణయం తీసుకుంది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బీసీబీ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ ఖచ్చితంగా తిరస్కరించింది. షెడ్యూల్ ప్రకారమే భారత్‌లోనే బంగ్లాదేశ్ మ్యాచ్‌లు జరుగుతాయని తేల్చిచెప్పింది. భారత్‌లో జరిగే ఏ వేదికలోనూ బంగ్లాదేశ్ ఆటగాళ్లకు, జట్టు అధికారులకు లేదా అభిమానులకు భద్రతా ముప్పు ఉందన్న స్పష్టమైన ఆధారాలు లేవని ఐసీసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో కేవలం అనుమానాల ఆధారంగా మ్యాచ్‌లను మరో దేశానికి తరలించడం సాధ్యం కాదని తెలిపింది. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిపిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది.
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్‌లను వేరే దేశానికి మార్చడం ఐసీసీ టోర్నీల గౌరవాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాక ప్రపంచ క్రికెట్ పాలక సంస్థగా ఐసీసీ పాటించాల్సిన తటస్థతపై కూడా ప్రశ్నలు తలెత్తుతాయి’’ అని ఐసీసీ అధికారికంగా స్పష్టం చేసింది. ఈ సమావేశంలో సభ్య దేశాల్లో బంగ్లాదేశ్, పాకిస్థాన్ మాత్రమే మ్యాచ్‌ల తరలింపునకు అనుకూలంగా ఓటు వేసినట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, భారత్‌కు వెళ్లాలా లేదా అన్న అంశంపై నిర్ణయం తీసుకోవాలని బీసీబీకి ఐసీసీ ఇప్పటికే గడువు విధించిన విషయం తెలిసిందే. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వ క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ మాత్రం ఐసీసీ ఒత్తిడికి తాము లొంగబోమని, తమ జట్టు భారత్‌కు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలు బంగ్లా క్రికెట్ వర్గాల్లో మరింత ఉద్రిక్తతకు కారణమయ్యాయి. 20 జట్లు పాల్గొంటున్న ఈ టీ20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ హాజరుకాకపోతే, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను చేర్చే అవకాశాన్ని ఐసీసీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, టోర్నీ నుంచి తప్పుకుంటే బీసీబీపై కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ప్రపంచకప్ ఆదాయంలో తమ వాటాను కోల్పోవడమే కాకుండా, భారీ జరిమానా కూడా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై పడే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల మధ్య భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడంతో వివాదం మరింత ముదిరింది. దీనికి ప్రతిగా భారత్‌లో తమ జట్టు భద్రతకు ముప్పు ఉందంటూ బీసీబీ, మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరింది. ఇదే సమయంలో దాయాది దేశం పాకిస్థాన్ బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలిచింది. భద్రతా కారణాల రీత్యా భారత్‌కు వెళ్లకూడదన్న బంగ్లా నిర్ణయాన్ని పాక్ సమర్థించింది. మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించడంలో ఇబ్బందులుంటే, వాటిని తమ దేశంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఐసీసీకి పాకిస్థాన్ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఐసీసీ బోర్డు సమావేశంలోనూ పాక్ బంగ్లాదేశ్‌కు అనుకూలంగా ఓటు వేసింది. వచ్చే నెల 7 నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తుది నిర్ణయం ఏ దిశగా వెళ్తుందన్నది ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
