BANGLA: బంగ్లా క్రికెట్‌లో ముదురుతున్న సంక్షోభం

టీ20 ప్రపంచకప్ చుట్టూ నెలకొన్న వివాదం బంగ్లాదేశ్ క్రికెట్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. అంతర్జాతీయ టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోవడం మాత్రమే కాకుండా, అంతర్గతంగా కూడా ఆరోపణలు–ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు అసిస్టెంట్ కోచ్ మహమ్మద్ సలావుద్దీన్ బహిరంగంగా మాజీ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. ప్రభుత్వ నిర్ణయమా? లేక ఆటగాళ్లు, బోర్డు తీసుకున్న నిర్ణయమా? అన్న అంశంపై వచ్చిన యూ-టర్న్ వ్యాఖ్యలే ఈ వివాదానికి కేంద్రబిందువయ్యాయి.
మాట మార్పుపై ఆగ్రహం
ప్రారంభంలో బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించకపోవడానికి తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కారణమని ఆసిఫ్ నజ్రుల్ ప్రకటించారు. అయితే కొద్ది రోజులకే ఆయన తన మాట మార్చి, భారత్‌కు వెళ్లకూడదన్న నిర్ణయం ఆటగాళ్లు మరియు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీసుకున్నదని చెప్పారు. ఈ విరుద్ధ ప్రకటనలపై అసిస్టెంట్ కోచ్ మహమ్మద్ సలావుద్దీన్ తీవ్రంగా స్పందించారు. “నేను స్వయంగా ఒక ఉపాధ్యాయుడిని. ఉపాధ్యాయులు సాధారణంగా అబద్ధాలు చెప్పరు. నజ్రుల్ కూడా బోధనా రంగానికే చెందినవారు. ఢాకా విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు పాఠాలు బోధించే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇలాంటి విధంగా మాట మార్చడం బాధాకరం” అని సలావుద్దీన్ వ్యాఖ్యానించారు. ఒకసారి ఒక కారణం చెప్పి, తర్వాత పూర్తిగా విరుద్ధంగా మాట్లాడటం అంగీకారయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. మాట మార్చి బంగ్లాదేశ్ క్రికెట్ ను నజ్రుల్ సంక్షోభం దిశగా తీసుకెళ్లాడని.. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలని నజ్రుల్ వెల్లడించారు.
ఆటగాళ్లపై మానసిక ప్రభావం
ఈ వివాదం కేవలం పరిపాలనా స్థాయిలోనే కాకుండా ఆటగాళ్లపై కూడా తీవ్ర ప్రభావం చూపిందని సలావుద్దీన్ తెలిపారు. “ఒక యువ క్రికెటర్ ప్రపంచకప్‌లో ఆడాలని కలలు కంటాడు. ఆ కలను ఒక్క క్షణంలో ధ్వంసం చేశారు. జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు ఐదు రోజుల పాటు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై ఆడే అవకాశాన్ని కోల్పోవడం ఒక ఆటగాడి కెరీర్లో పెద్ద దెబ్బ అని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాల వెనుక భారత్–బంగ్లాదేశ్‌ల మధ్య నెలకొన్న దౌత్య ఉద్రిక్తతలూ ప్రధాన పాత్ర పోషించాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి విడుదల చేసిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేయాలని ఆదేశించింది. బంగ్లాదేశ్ క్రికెట్‌లో పరిపాలనా స్థాయిలో స్పష్టతలేమి ఉన్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకసారి ప్రభుత్వం నిర్ణయం అంటూ చెప్పడం, తర్వాత ఆటగాళ్లు–బోర్డు నిర్ణయమని చెప్పడం ప్రజల్లో సందేహాలు రేకెత్తించింది. సలావుద్దీన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ అస్పష్టతను బహిర్గతం చేశాయి. అంతర్జాతీయ టోర్నీ వంటి కీలక వేదికలో జట్టు పాల్గొనకపోవడం వెనుక అసలు కారణాలు ఏమిటి? భద్రతా ఆందోళనలే నిజమైన కారణమా? లేక దౌత్య ఉద్రిక్తతల ప్రభావమా? అనే ప్రశ్నలు ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ వివాదం బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. యువ ఆటగాళ్లలో నిరుత్సాహం నెలకొనే ప్రమాదం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
