WIMBLEDON 2024: వింబుల్డన్‌ మహిళ సింగిల్స్‌ విజేత క్రెజికోవా

WIMBLEDON 2024: వింబుల్డన్‌ మహిళ సింగిల్స్‌ విజేత క్రెజికోవా
X
ఉత్కంఠభరిత ఫైనల్లో పావోలినిపై విజయం... తానే నమ్మలేకపోతున్నా అంటూ కామెంట్స్‌

వింబుల్డన్‌లో చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి క్రెజికోవా అదరగొట్టింది. తొలిసారి వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో క్రెజికోవా 6-2, 2-6, 6-4 తేడాతో ఇటలీకి చెందిన ఏడో సీడ్‌ పావోలినిపై విజయం సాధించి తన కల నెరవేర్చుకుంది. తొలి సెట్‌ మొదటి గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన క్రెజికోవా దూకుడు ప్రదర్శించింది. తొలి 11 పాయింట్లలో ఆమె 10 గెలిచింది. రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసి చూస్తుండగానే 5-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే ఊపులో సెట్‌ సొంతం చేసుకుంది. ఒత్తిడిలో పడ్డ పావోలిని పనైపోయిందనిపించింది. కానీ రెండో సెట్లో ఆమె ఉత్తమ ఆటతీరుతో సాగిపోయింది. డ్రాప్, క్రాస్‌కోర్టు షాట్లతో పాయింట్లు రాబట్టింది. రెండో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఆమె ఆపై 3-0తో ఆధిపత్యం ప్రదర్శించింది. మరింత శక్తిని కూడదీసుకుని, వేగవంతమైన సర్వీస్‌లతో సెట్‌ను ముగించింది. దీంతో పోరు నిర్ణయాత్మక సెట్‌కు మళ్లింది.

నిర్ణయాత్మకమైన మూడో సెట్‌లో పావోలిని డ్రాప్‌ షాట్లకు, క్రాస్‌కోర్టు షాట్లకు క్రెజికోవా అలరించింది. విన్నర్లతో పాయింట్లు రాబట్టింది. పావోలిని కూడా ధాటిగా ప్రతిస్పందించడంతో స్కోరు 3-3తో సమమైంది. అయితే కీలక సమయంలో ఒత్తిడితో పావోలిని అనవసర తప్పిదాలు చేసింది. పదో గేమ్‌లో మ్యాచ్‌ పాయింట్‌ కోసం క్రెజికోవా చెమటోడ్చాల్సి వచ్చింది. చివరకు సర్వీస్‌ను రిటర్న్‌ చేసేటప్పుడు పావోలిని బంతిని కోర్టు బయటకు కొట్టడంతో క్రెజికోవా ఆనందంలో మునిగిపోయింది. వెంటనే స్టాండ్స్‌లోకి వెళ్లి కుటుంబ సభ్యులు, కోచ్‌లతో సంతోషాన్ని పంచుకుంది.

ఈ విజయం నమ్మశక్యంగా లేదని... తన టెన్నిస్‌ కెరీర్‌లో, జీవితంలో ఇదే అత్యుత్తమ రోజుని క్రెజికోవా ఆనందం వ్యక్తం చేసింది. ఫైనల్‌కు వచ్చానంటే ఎవరూ నమ్మలేదని... ఇప్పుడు వింబుల్డన్‌ గెలిచానంటే కూడా నమ్మరేమోనని క్రెజికోవా అన్నారు. ఈ విజయాన్ని తానే నమ్మలేకపోతున్నానని వెల్లడించారు.

Tags

Next Story