T20 Cricket: భారత T20 జట్టు ప్రకటన, కెప్టెన్‌గా హార్ధిక్

విండీస్ పర్యటనకు భారత టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికైన మరుసటి రోజే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ హార్ధిక్ పాండ్యా నేతృత్వంలో జట్టును ఎంపిక చేసింది. ఈ నెలలో ప్రారంభం కానున్న టెస్ట్, వన్డే జట్లను ఇంతకు ముందే ప్రకటించారు. ప్రస్తుతం 15 మంది సభ్యులతో కూడిన జట్టు విండీస్‌లో 5 టీ20 మ్యాచుల్లో ఆడనున్నారు. ఆగస్ట్ 3 నుంచి 13 వరకు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 12 నుంచి జరిగే టెస్ట్ మ్యాచ్‌తో ఈ పర్యటన మొదలవనుంది.
వచ్చే సంవత్సరం విండీస్‌లో టీ20 వరల్డ్‌కప్‌ని దృష్టిలో ఉంచుకుని నాయకత్వ బాధ్యతలు, యువఆటగాళ్లకు ప్రాధాన్యం కల్పించాలన్న బీసీసీఐ ఉద్దేశ్యం ఈ నిర్ణయంతో వెల్లడైంది. సీనియర్ ఆటగాళ్లు విరాట్, కోహ్లీ, రోహిత్ శర్మలు టీ20 జట్టులో లేరు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి కూడా విశ్రాంతి కల్పించారు. హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యాడు.
వన్డే జట్టు, టెస్ట్ జట్టులో స్థానం సాధించిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ యశస్వి జైస్వాల్, టీ20 జట్టులోనూ స్థానం దక్కించుకున్నాడు. ఇక ముంబయ్ ఇండియన్స్ ప్లేయర్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ, పిలుపునందుకుని తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగ్రేటం చేయనున్నాడు. IPLల్లో ముంబయ్ అతడిని రూ.1.7 కోట్లకు కొనుగోలు చేసింది. ముంబయి తరపున తిలక్ 11 మ్యాచుల్లో 343 పరుగులతో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.
స్పిన్నర్ రవి బిష్ణోయ్, బ్యాట్స్‌మెన్ సంజూ సాంసన్, గాయం నుంచి కోలుకున్న ఆవేశ్ ఖాన్‌లు జట్టులో స్థానం నిలుపుకున్నారు. అయితే వన్డేలకు ఎంపికైన చెన్నై ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ఓపెనర్ పృథ్వీ షాలకు టీ20 జట్టులో స్థానం దక్కలేదు. కోల్‌కతా టీంతో సంచలనంగా ఆడిన రింకూ సింగ్‌ని కూడా జట్టులోకి తీసుకోలేదు.
భారత T20 జట్టు
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‌మాన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
భారత్ Vs వెస్టిండీస్ టీ20 సిరీస్ షెడ్యూల్
1వ టీ20: బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ, ట్రినిడాడ్, ఆగస్టు 3
2వ టీ20: ప్రొవిడెన్స్ స్టేడియం, గయానా, ఆగస్టు 6
3వ టీ20: ప్రొవిడెన్స్ స్టేడియం, గయానా, ఆగస్టు 8
4వ T20: సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం, లాడర్‌హిల్, ఫ్లోరిడా, ఆగస్టు 12
5వ T20: సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం, లాడర్‌హిల్, ఫ్లోరిడా, ఆగస్టు 13
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com