BCCI: బీసీసీఐలో మళ్లీ దాదా యుగం !

బీసీసీఐ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ రాజీనామా చేయడంతో తర్వాత అధ్యక్షుడు ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల్లో జరిగే బీసీసీఐ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎవరెవరు నామినేషన్లు దాఖలు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీమిండియా మాజీ ఆటగాళ్లు కూడా ఈ రేసులో ఉన్నారు. గతంలో భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశాడు. పదవీ కాలం పూర్తయిన తర్వాత మళ్లీ కూడా గంగూలీనే ఎన్నికవుతారని అనుకున్నప్పటికీ సాధ్యం కాలేదు. మరి రానున్న రోజుల్లో గంగూలీ మరోసారి అధ్యక్ష పదవి రేసులో నిలుస్తాడా? లేదా? అనే దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. అయితే గంగూలీ ఈ పదవికి పోటీ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కాకపోతే త్వరలో జరగనున్న బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్ష పదవికి దాదా పోటీ చేస్తున్నారని సమాచారం. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష పదవి నుంచి తప్పుకొని మూడేళ్లు కావొస్తున్న నేపథ్యంలో క్యాబ్ అధ్యక్ష పదవికి గంగూలీ పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. క్యాబ్ ఎన్నికల్లో దాదా ఏకగ్రీవంగా ఎన్నికవుతాడా? లేదా పోటీ ఎదుర్కొంటాడా? అనేది చూడాలి.
హెడ్‌కోచ్ పాత్రలో...
దక్షిణాఫ్రికా టీ20 లీగ్ 2026 సీజన్ కోసం ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు గంగూలీని హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ మేరకు పిట్రోరియా క్యాపిటల్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే SA20 నాల్గవ సీజన్ కోసం భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రిటోరియా క్యాపిటల్స్ ప్రధాన కోచ్‌గా నియామకమయ్యారని పేర్కొంది. మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ జోనాథన్ ట్రాట్ స్థానంలో గంగూలీ ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రొఫెషనల్ క్రికెట్ జట్టుకు హెడ్‌కోచ్‌గా గంగూలీ పూర్తి స్థాయి పాత్ర పోషించడం ఇదే మొదటిసారి. 53 ఏళ్ల గంగూలీ గత సంవత్సరం నుంచి ప్రిటోరియా క్యాపిటల్స్ మాతృ సంస్థ అయిన జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌కు క్రికెట్ డైరెక్టర్ పని చేసిన విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com