BCCI: ఆటగాళ్లపై బీసీసీఐ కఠిన ఆంక్షలు

ఐపీఎల్ ప్రస్తుత సీజన్ కీలక దశకు చేరుకుంటున్న వేళ ఆటగాళ్ల భద్రత, క్రమశిక్షణ అంశాల్లో బీసీసీఐ మరింత కఠిన వైఖరి అవలంబిస్తోంది. టోర్నీ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఎలాంటి ఘటనలనూ సహించబోమని స్పష్టం చేస్తూ, ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, జట్టు అధికారులపై కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా హోటల్ భద్రత, బయటి వ్యక్తులతో సంబంధాలు, ఆటగాళ్ల కదలికల విషయంలో కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కొన్ని అవాంఛనీయ సంఘటనలు, ప్రోటోకాల్ ఉల్లంఘనలు బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం దృష్టికి రావడంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్ని ఫ్రాంచైజీల సీఈఓలకు ప్రత్యేక లేఖలు పంపారు. మొత్తం ఏడు పేజీల నిబంధనల పత్రాన్ని జతచేస్తూ ఆటగాళ్ల ప్రవర్తన, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. టోర్నీ గౌరవాన్ని దెబ్బతీసే చర్యలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సీజన్లో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, జట్టు అధికారుల ప్రమేయంతో కొన్ని క్రమశిక్షణా ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని, వాటిని నిర్లక్ష్యం చేస్తే ఐపీఎల్‌తో పాటు ఫ్రాంచైజీలు, బీసీసీఐ ప్రతిష్ఠకు కూడా నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.
కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఆటగాళ్లు లేదా సహాయక సిబ్బంది తమ హోటల్ గదుల్లోకి అనధికార వ్యక్తులను అనుమతించకూడదు. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా ఇతర అతిథులు కలవాలంటే తప్పనిసరిగా మేనేజర్ నుంచి ముందస్తు లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా గదుల్లోకి తీసుకెళితే అది తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఒకవేళ ఆటగాళ్లు బయటివారిని కలవాల్సి వస్తే హోటల్ లాబీ లేదా లాంజ్లలో మాత్రమే సమావేశం కావాలని సూచించింది. ఇక ఆటగాళ్ల కదలికలపైనా బీసీసీఐ ప్రత్యేక నిఘా పెట్టింది. వ్యక్తిగత పనుల నిమిత్తం హోటల్ వెలుపలికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ (ఎస్ఎల్ఓ) లేదా టీమ్ ఇంటిగ్రిటీ ఆఫీసర్ (టీఐఓ)కు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. వారి అనుమతి లేకుండా ఎవరూ హోటల్ నుంచి బయటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆటగాళ్ల కదలికలపై ప్రత్యేక నియంత్రణలు అమలు చేయనుంది. టోర్నీ కీలక దశలో ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినకుండా, భద్రతా సమస్యలు తలెత్తకుండా ఉండటమే ఈ చర్యల వెనుక ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో హనీట్రాప్‌లు, బ్లాక్మెయిల్ ప్రయత్నాలు పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ అప్రమత్తమైనట్లు సమాచారం. ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసపూరిత చర్యలు, చట్టపరమైన సమస్యలు, బెట్టింగ్ ముఠాల జోక్యం వంటి అంశాలపై అవినీతి నిరోధక విభాగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్లు అనవసర వివాదాల్లో చిక్కుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా మ్యాచ్‌ల సమయంలో కూడా ఫ్రాంచైజీల ప్రవర్తనపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫ్రాంచైజీ యజమానులు లేదా సీనియర్ మేనేజ్మెంట్ సభ్యులు డగౌట్‌లోకి వెళ్లి ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందితో మాట్లాడకూడదని స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
