BCCI: సీనియర్లపై వేటుకు రంగం సిద్ధం!

BCCI: సీనియర్లపై వేటుకు రంగం సిద్ధం!
X
రోహిత్, విరాట్ కోహ్లీలను టెస్టు జట్టు నుంచి తప్పించవచ్చన్న సంకేతాలు... దిద్దుబాటు చర్యలు చేపట్టిన బీసీసీఐ

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఘోరంగా విఫలమైన సీనియర్లపై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫైనల్ టెస్టు ఆడేశారనే చాలామంది అభిమానులు భావిస్తున్నారు. మెల్ బోర్న్ తోనే రోహిత్ టెస్టు కెరీర్ ముగిసిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే తాను రిటైర్మెంట్ ప్రకటించలేదని విశ్రాంతి తీసుకున్నానని రోహిత్ తెలిపాడు. బీసీసీఐ మాత్రం రోహిత్ వాదనను పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఓటమితో టీమిండియాలో బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జట్టు ప్రక్షాళన సీనియర్లైన రోహిత్‌, కోహ్లీతోనే మొదలుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొత్త జట్టు ఎంపికపై సెలక్టర్లకు బీసీసీఐ కొత్త కార్యదర్శి దేవజిత్‌ సైకియా నుంచి కఠిన సందేశం వెళ్లినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చీఫ్‌ సెలక్టర్‌ అగార్కర్‌ కొత్త జట్టును ఎంపిక చేసే విషయంలో కఠినంగా ఉండాలని సూచించినట్లు వార్తలొస్తున్నాయి.

టీమిండియాకు భారీ షాక్

బోర్డర్- గవాస్కర్ సిరీస్‌ను కోల్పోయిన టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు మూడో స్థానానికి పడిపోయింది. టీమిండియా 2016 తర్వాత తొలిసారి మూడో స్థానానికి పడిపోవడం గమనార్హం. ఈ జాబితాలో ఆస్ట్రేలియా(126 పాయింట్లు) తొలి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా (112), భారత్ (109), ఇంగ్లాండ్ (106), న్యూజిలాండ్ (96) ఉన్నాయి.

అభిమానులపై యువరాజ్ సింగ్ ఫైర్

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని అభిమానులు నిందించడంపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించారు. ‘ఎన్నో అవార్డులు సాధించి దేశ ఖ్యాతిని నిలిపిన ఆటగాళ్లు రోహిత్, కోహ్లీ. వాళ్లు సాధించిన విజయాలను ప్రజలు మరిచిపోయి ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో వారు గొప్ప ఆటగాళ్లు. ఈ సిరీస్‌లో వాళ్లు ఓడిపోయారు నిజమే. కానీ ఓడిపోయినందుకు మనకంటే వాళ్లు ఎక్కువ బాధపడుతున్నారు.’ అని అన్నారు.

ప్రతిష్టాత్మక అవార్డుకు ‘బుమ్రా’ నామినేట్‌

భారత స్టార్ బౌలర్ బుమ్రా ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యాడు. డిసెంబర్‌ నెల ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డుకు ఎంపికయ్యాడు. బుమ్రాతో పాటు పాట్‌ కమిన్స్‌, సౌతాఫ్రికా ప్లేయర్ డేన్‌ పాటర్సన్‌ కూడా నామినేట్‌ అయ్యారు. డిసెంబర్‌‌ నెల ప్రదర్శనల ఆధారంగా ఐసీసీ వీరిని నామినేట్‌ చేసింది. కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా 32 వికెట్లతో రాణించిన విషయం తెలిసిందే.

Tags

Next Story