RCB: బెంగళూరు జట్టుపై పెరుగుతున్న అంచనాలు

ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు....ఈసారి కప్పును కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. ఈ సారి బెంగళూరు జట్టు అదిరే ప్రదర్శన చేస్తోంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు జట్టును ప్రక్షాళన చేసిన ఆర్సీబీ మేనేజ్‌మెంట్.. పక్కా ప్లానింగ్‌తో ఆటగాళ్లను తీసుకుంది. ఇప్పుడు ఆర్సీబీ సత్ఫలితాలను సాధిస్తోంది. తమ టీమ్ లో టాలెంటెడ్ ప్లేయర్లకు కొదవ లేకున్నా..ఆ జట్టు తలరాత మాత్రం మారట్లేదు. క్రిస్ గేల్, ఎబి డివిలియర్స్ లాంటి విధ్వంసకర బ్యాటర్లే జట్టును ఛాంపియన్ గా నిలబెట్టలేకపోయారన్న విమర్శలు ఎదురయ్యాయి. ప్రతి ఏడాది ఈ సాల కప్ నమదే అంటూ సందడి చేయడం… మిడ్ సీజన్లోనే చేతులెత్తేయడం అలవాటైపోయింది. అయితే ఈ సీజన్ లో ఆర్సీబీకి అన్నివిధాలుగా కలిసొచ్చింది. బలమైన ప్రత్యర్థి జట్లను దాటుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. మరోవైపు కావాల్సిన రన్ రేట్ ని మైంటైన్ చేస్తుంది.
కెప్టెన్ పాటిదార్ సారధ్యంలో...
ఈ సీజన్ లో కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గొప్ప లయలో కనిపిస్తోంది. 18వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతంగా రాణించింది. 11 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌ల్లో గెలిచి, 3 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. ఈ అద్భుతమైన ప్రదర్శన కారణంగా ఆర్‌సీబీ 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉంది. అదే సమయంలో, ఈ సంవత్సరం ఆర్‌సీబీ 18 సంవత్సరాల కరువును అంతం చేయగలదని క్రీడా నిపుణులు విశ్వసిస్తున్నారు.
భార్యకు విడాకులిచ్చేస్తాడట
ఈ సారి కూడా బెంగళూరు కప్ కొట్టకపోతే నా భార్యకు విడాకులిస్తానని ఓ ఫ్యాన్ ఇచ్చిన స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. మీరు మీ భార్యకు విడాకులు ఇచ్చేందుకు రెడీగా ఉండండని ఒకరు పోస్ట్ పెడితే.. మరో నెటిజన్.. తన భార్య ఆర్సీబీ టైటిల్ కొట్టొద్దని దేవుడ్ని మొక్కుకుంటుందని సెటైరికల్ కామెంట్ చేశాడు. ఏదేమైనా ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవాలని కోట్లాది మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం జట్టు బ్యాటింగ్‌తో పాటు, బౌలింగ్ విభాగంలోనూ సత్తా చాటుతుంది. చూడాలి మరి చివరకు ఎం జరుగుతుందో..
గవాస్కర్ ఓటు ఆర్సీబీకే
ఐపీఎల్ 2025 విజేతగా ఎవరు నిలుస్తారనే విషయంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అంచనా వేశారు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ.. ఈసారి విజేతగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జోస్యం చెప్పారు. “ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతంగా రాణిస్తోంది. జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ సూపర్. ముంబై ఇండియన్స్ టీమ్ కూడా మంచి ప్రదర్శన చేస్తోంది. కానీ వాళ్లు చివరి వరకూ ఈ జోరును కొనసాగిస్తారా? లేదా అన్నది తేలాల్సి ఉంది. ఈసారి ఆర్సీబీ టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఆ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది” అని గావస్కర్ వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com