BGT: బాక్సింగ్ డే టెస్టు... ఆస్ట్రేలియా ఆలౌట్

BGT: బాక్సింగ్ డే టెస్టు... ఆస్ట్రేలియా ఆలౌట్
X
స్టీవ్ స్మిత్ అద్భుత సెంచరీ... నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా

మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీ సాధించగా.. మార్నస్ లబుషేన్ (72), సామ్ కాన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖవాజా (57) అర్ధ శతకాలు సాధించారు. పాట్ కమిన్స్ (49), అలెక్స్ కేరీ (31) విలువైన పరుగులు రాబట్టారు. ట్రావిస్ హెడ్ డకౌట్ కాగా.. మిచెల్‌ మార్ష్‌ (4) విఫలమయ్యారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్ దీప్ 2, సుందర్ ఒక వికెట్ పడగొట్టారు. చివర్లో ఆసీస్ టెయిలెండర్లు దాదాపు తొమ్మిది ఓవర్లపాటు వికెట్ ఇవ్వకుండా టీమ్‌ఇండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. బుమ్రా బౌలింగ్‌లో లైయన్ (13) చివరి వికెట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది.

ఆ గొడవ అవసరం లేదు: గావస్కర్

ఆసీస్ ఓపెనర్ సామ్‌ కాన్‌స్టాస్‌, విరాట్ కోహ్లీ మధ్య జరిగిన వాగ్వాదంపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించారు. ‘వాగ్వాదానికి కారణం ఏంటో నాకు తెలియదు. కానీ, నిజంగా ఈ గొడవ అవసరం లేదు. ఆటపరంగా పోటీతత్వం ఉంటే తప్పు లేదు. మనం కోహ్లీని ఆటలో గొప్ప క్రికెటర్లలో ఒకరిగా గుర్తుంచుకోవాలనుకుంటున్నాం. ICC జరిమానా విధించిన వ్యక్తిగా కాదు.. అతడు దీన్ని మళ్లీ పునరావృతం చేయకూడదని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

ఓపెనర్‌గా రోహిత్.. కోచ్ క్లారిటీ

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో రోహిత్ శర్మ ఓపెనర్‌గా రావడంపై భారత జట్టు అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రోహిత్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. కేఎల్ రాహుల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. గిల్‌ను కావాలని డ్రాప్ చేయలేదు. కానీ అతడికి సరైన ఆరంభం లభించలేదు. జట్టు నుంచి తప్పించడాన్ని అతను అర్థం చేసుకుంటాడు’ అని నాయర్ చెప్పారు.

కోహ్లితో వాగ్వాదం.. స్పందించిన సామ్

బాక్సింగ్‌ డే టెస్టు మొదటి రోజు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో వాగ్వాదంపై ఆస్ట్రేలియా యువ ఆటగాడు సామ్‌ కాన్‌స్టాస్ స్పందించాడు. ‘మేమిద్దరం కాస్త భావోద్వేగానికి గురయ్యామని అనుకుంటున్నా. విరాట్ వస్తున్నట్లు నేనూ గమనించలేదు. నా గ్లవ్స్‌ను సరిచేసుకొనే పనిలో ఉన్నా. అయితే, క్రికెట్‌లో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇదేమీ పెద్ద సమస్య కాదని భావిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు.

Tags

Next Story