BGT: నితీశ్ కుమార్ రెడ్డి " తగ్గేదే లే"

BGT: నితీశ్ కుమార్ రెడ్డి  తగ్గేదే లే
X
గండం గట్టెక్కించిన తెలుగు కుర్రాడు... భారత్ కు తగ్గిన ఫాలో ఆన్ గండం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియాను తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఆదుకున్నాడు. మెల్‌బోర్న్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఎదురీదుతున్న టీమ్‌ఇండియాను ఆపద్బాంధవుడు అయ్యాడు. ఆస్ట్రేలియాపై తొలి హాఫ్‌ సెంచరీతో ఫాల్‌ఆన్‌ ముప్పు తప్పించాడు. 5 వికెట్ల నష్టానికి 164 రన్స్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్‌ 55వ ఓవర్‌లో వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (28)ను బోలాండ్‌ ఔట్‌ చేశాడు. దీంతో క్రీజులోకి వచ్చిన నితీశ్‌ కుమార్‌ జడేజాతో కలిసి ఒక్కో పరుగు జోడిస్తూ స్కోర్‌ బోర్డును ముందుకు నడిపించాడు. ఈ దశలో మరోసారి ఆసీస్‌ బౌలర్లు పైచేయి సాధించారు. క్రీజులో కుదుకుంటున్న ఆల్‌రౌండర్‌ జడేజా (17)ను నాథన్‌ ఎల్బీడబ్ల్యూగా పెవీలియన్‌కు పంపించాడు. దీంతో భారత్‌కు ఫాల్‌ ఆన్‌ గండం తప్పదనే అనిపించింది. అయితే నితీశ్‌తో జతకట్టిన వాషింగ్టన్‌ సుందర్‌ ఆసీస్‌ సేస్‌ దళాన్ని సమర్థంగా ఎదుర్కొన్నాడు. వర్షం పడి ఆట ముగిసే సమయానికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది.

నితీశ్‌ రెడ్డి తొలి హాఫ్‌ సెంచరీ‌

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో బ్యాటింగ్ కు వచ్చాడు నితీశ్ కుమార్ రెడ్డి. ఫాలో ఆన్ గండం పొంచి ఉన్న వేళ.. అద్భుత ఆటతీరుతో టీమిండియాను ఆదుకున్నాడు. కంగారు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని టీమిండియాను పోరాడే స్థితిలో నిలిపాడు. వర్షం పడి ఆట ముగిసే సమయానికి 119 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్సుతో 85 పరుగులతో అజేయంగా నిలిచాడు.

పుష్ప హవా

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మెల్ బోర్న్ టెస్టులో పుష్ప హవా కనిపించింది. అర్ధ శతకం సాధించిన తర్వాత నితీశ్ కుమార్ రెడ్డి తగ్గేదేలే అంటూ సెలబ్రెషన్ చేసుకున్నాడు. దీంతో కామేంటేటర్ కూడా పుష్ప అంటూ వ్యాఖ్యానించడం వైరల్ గా మారింది. దీంతో పుష్ప హవా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోందని అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీంతో నెట్టింట తగ్గేదేలే మరోసారి వైరలైంది.

Tags

Next Story