AUS vs IND: బుమ్రాను టార్గెట్ చేసిన ఆస్ట్రేలియా: కివీస్‌ మాజీ క్రికెటర్

AUS vs IND: బుమ్రాను టార్గెట్ చేసిన ఆస్ట్రేలియా: కివీస్‌ మాజీ క్రికెటర్
X
నాలుగింటిలో విజయం సాధించాలనుకుంటున్న ఆస్ట్రేలియా

సొంతగడ్డపై న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో ఘోర పరాభవం చవిచూసిన టీమిండియాకు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కీలకం. అటు ఆస్ట్రేలియాకు అత్యంత కీలకం. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకోవాలంటే సిరీస్‌ విజయంతోపాటు ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకూడదు. ఈ సిరీస్‌లో అందరి దృష్టి బుమ్రాపైనే ఉంది. అతడిని అడ్డుకోవడంపైనే ఆసీస్‌ అవకాశాలు ఆధారపడి ఉన్నాయనేది ప్రతిఒక్కరికీ తెలిసిందే. ఈక్రమంలో బుమ్రాను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ఓ మాస్టర్ ప్లాన్‌ వేసినట్లు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ వ్యాఖ్యానించాడు. షెడ్యూల్‌ చూస్తే అలానే అనిపిస్తుందని పేర్కొన్నాడు. భారత జట్టులో బుమ్రా కాకుండా.. మిగతా పేసర్ల పరిస్థితి అంతర్జాతీయ స్థాయిలో లేకపోవడం కాస్త ఇబ్బందికరమేనని తెలిపాడు. షమీ ఉండుంటే టీమ్‌ఇండియాను అడ్డుకోవడం ఆసీస్‌కు కష్టంగా మారేదని స్పష్టంచేశాడు.

జియో సినిమాలో సైమన్ డౌల్ మాట్లాడుతూ… ‘ఆస్ట్రేలియా షెడ్యూలింగ్‌లోనే స్మార్ట్‌గా వ్యవహరించినట్లు అనిపిస్తోంది. తమ బ్యాటింగ్‌ పైనా స్పష్టత మాత్రమే కాదు.. టీమిండియా బ్యాటర్ల గురించి వారికి పూర్తి అవగాహన ఉంది. అయితే ఆస్ట్రేలియాకు జస్ప్రీత్ బుమ్రా నుంచి అతి పెద్ద ముప్పు ఉంది. అందుకే మూడు పిచ్‌లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పెర్త్‌లో వేడి దెబ్బకు బుమ్రా ఉడికిపోయేలా ప్రణాళికలను రూపొందించినట్లు ఉంది. భారత జట్టులో అతడే ఎక్కువ ఓవర్లు వేయాల్సి ఉంటుంది. కానీ పెర్త్‌ పరిస్థితులు అందుకు పెద్దగా సహకరించవు. మిగతా బౌలర్ల నుంచి సహకారం లేకపోతే బుమ్రా పైనే ఎక్కువ భారం పడుతుంది. అడిలైడ్‌, బ్రిస్బేన్‌లో కూడా పేస్‌ బౌలర్లకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అక్కడ కూడా బుమ్రానే ఎక్కువ ఓవర్లు వేయాల్సి ఉంటుంది. మహమ్మద్ షమీ లేకపోవడం భారత జట్టుకు తీవ్ర నష్టం’ అని అన్నాడు.

ఆసీస్‌లో ..

ఆస్ట్రేలియాలో భారత గత రెండు సిరీస్‌లను గెలవడంలో బుమ్రా కూడా భాగస్వామి. ఆసీస్‌లో 7 టెస్టులు ఆడిన బుమ్రా 32 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒకసారి ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. 2018లోనే 6/33 బౌలింగ్‌ గణాంకాలను నమోదు చేశాడు. ఒకే మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీశాడు.

Tags

Next Story