MARY KOM: బాక్సింగ్‌కు మేరీ కోమ్ వీడ్కోలు

ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ ఆటకు వీడ్కోలు పలికారు. 2012 ఒలింపిక్స్ పతక విజేత అయిన మేరీకోమ్ తన వయసు దృష్ట్యా రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలిపారు. వయోపరిమితిని కారణంగా పేర్కొంటూ క్రీడల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటనతో భారత బాక్సింగ్‌లో స్వర్ణ యుగం ముగిసింది. 41 ఏళ్ల మేరీకోమ్ తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. తనకు బాక్సింగ్ నుంచి వైదొలగాలని లేదని, వయోపరిమితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బాక్సింగ్ రూల్స్ ప్రకారం ఎలైట్ లెవెల్‌లో ఆడాలంటే ఎవరికైనా 40 ఏళ్లే గరిష్ఠ వయో పరిమితి. ప్రస్తుతం మేరీ వయసు 41 కావడంతో తను ఆట నుంచి తప్పక వైదొలగాల్సి వచ్చింది. తనకు ఇంకా ఆడాలని ఉందని... దురదృష్టవశాత్తు వయస్సు తన ఆటకు అడ్డంకిగా మారిందని మేరికోమ్ తెలిపారు. ఇక నేను ఏ ఈవెంట్స్‌లోనూ పాల్గొనలేనని... తనకు ఇంకా ఎక్కువ రోజులు ఆడాలని ఉన్నప్పటికీ బలవంతంగా ఆట నుంచి వైదొలుగుతున్నానని ప్రకటించారు. తన జీవితంలో అనుకున్నవన్నీ సాధించానని వెల్లడించారు.
18 ఏళ్ల వయసులో పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్‌లో జరిగిన బాక్సింగ్ పోటీల్లో అంతర్జాతీయ ప్రవేశం చేసిన ఈ మణిపుర్ స్టార్.. 48 కేజీల విభాగంలో తొలిసారి ఫైనల్ చేరి చివరిమెట్టుపై బోల్తా పడింది. అనంతరం జరిగిన ఏఐబీఏ ఉమెన్స్ ప్రపంచ ఛాంపియన్‌లో విజేతగా నిలిచి భారత్ తరఫున బాక్సింగ్‌లో తొలిసారి బంగారు పతకం సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 2005, 2006, 2008, 2010లో వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో విజేతగా నిలిచింది. మేరీ కోమ్ 2012లో లండన్ ఒలింపిక్స్‌లో 51 కేజీల విభాగంలో కాంస్యం సాధించి, మహిళల బాక్సింగ్‌లో ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ బాక్సర్‌గా నిలిచింది.
ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీ కోమ్.. 2021లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకుంది. మేరీ 8 ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు, 7 ఆసియా ఛాంపియన్‌షిప్ పతకాలు, 2ఆసియా క్రీడల పతకాలు, ఒక కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతకం సాధించింది. 2020లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది. 2016 నుంచి 2022 వరకు రాజ్యసభ సభ్యురాలిగానూ వ్యవహరించారు. 2018లో ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఛాంపియన్ పోటీల్లో మరోసారి విజేతగా నిలిచింది. అంతర్జాతీయ పోటీల్లో అద్భత ప్రదర్శనతో దేశానికి చిరస్మరణీయ విజయాలు సాధించిపెట్టిన మేరీకోమ్ గత కొద్ది రోజులుగా ఆటకు దూరంగా ఉన్నారు. మేరీ కోమ్‌ను ఐరన్ లేడీ అని కూడా అంటుంటారు. బాక్సింగ్ రింగ్‌లోనే కాదు, నిజజీవితంలోనూ ఆమె సమస్యలతో పోరాటం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com