bumrah: బుమ్రా బరిలోకి దిగుతాడా..? లేదా.?

లార్డ్స్ టెస్టు పరాజయం ఆటగాళ్లతో పాటు అభిమానులను కూడా తీవ్ర వేదనకు గురిచేసింది. ఎన్నడూ గెలవని బర్మింగ్‌హామ్‌లో విజయకేతనం ఎగురవేసిన తర్వాతి మ్యాచ్‌లోనే ఈ పరాజయం ఎదురైంది. దీంతో ఇప్పుడు ఐదు టెస్టుల సిరీస్ అత్యంత ఆసక్తిరంగా మారింది. ఈనెల 23 నుంచి ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరిగే నాలుగో టెస్టు గెలిస్తేనే భారత్ ఆశలు సజీవంగా ఉంటాయి. గురువారం నుంచి గిల్ సేన తమ సన్నాహకాలను కూడా ఆరంభించింది. అయితే తమ ప్రధాన ఆయుధం పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఈ మ్యాచ్‌లో బరిలోకి దించుతారా? లేదా? అనే సందేహం అందరిలో నెలకొంది. బుమ్రా ఈ సిరీ్‌సలో మొదటి, మూడో టెస్టులో మాత్రమే ఆడాడు. ఈ రెండింట్లో కలిపి12 వికెట్లు తీశాడు. అయితే పనిఒత్తిడిలో భాగంగా కేవలం మూడు టెస్టులకు మాత్రమే అందుబాటులో ఉంటాడని ఈ పర్యటనకు ముందే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. దీంతో చివరిదైన ఐదో టెస్టులో మాత్రమే బుమ్రాను ఆడిస్తారంటూ కథనాలు వెలువడుతున్నాయి.
టీమిండియాపై ఒత్తిడి
తాజాగా జట్టు పరిస్థితిని గమనిస్తే ఇబ్బందికరంగా ఉంది. లార్డ్స్ ఓటమి గిల్ సేనను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ప్రస్తుతం 1-2తో వెనుకబడిన దశలో మాంచెస్టర్ టెస్టును కోల్పోతే సిరీస్ పోయినట్టే. పైగా లెఫ్టామ్ పేసర్ అర్ష్‌దీప్ నెట్ ప్రాక్టీ్‌సలో గాయపడ్డాడు. అతడు బౌలింగ్ వేసే చేతికి ప్లాస్టర్‌తో కనిపించాడు. ఇప్పటికే కీపర్ పంత్ చేతి వేలికి గాయం కాగా, నొప్పిని భరిస్తూనే తను మూడో టెస్టులో బ్యాటింగ్ చేశాడు. దీంతో నాలుగో టెస్టుకు పంత్ అందుబాటులో ఉండడం కష్టమే. ఇలాంటి సమస్యలు చుట్టుముట్టిన వేళ.. బుమ్రాకు విశ్రాంతినివ్వడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తప్పదు!
టీమ్ఇండియా పేస్ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ నేపథ్యంలో ఈ సిరీస్‌లో పూర్తి మ్యాచ్‌లు ఆడడని కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ముందుగానే ప్రకటించారు. అందులో భాగంగా బుమ్రా.. లీడ్స్, లార్డ్స్ టెస్ట్‌లో మాత్రమే ఆడాడు. టీమ్ఇండియా ఒకవేళ లార్డ్స్‌లో గెలిచి ఉంటే.. బుమ్రాకు మాంచెస్టర్ టెస్ట్‌లో విశ్రాంతి ఇచ్చినా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు! కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో కచ్చితంగా బుమ్రాను ఆడించాల్సిన పరిస్థితి! ఎందుకంటే ప్రస్తుతం టీమ్ఇండియాలో పేస్ దళంలో బుమ్రానే సీనియర్ బౌలర్. అలాగే జీవం లేని, నిస్సారమైన పిచ్‌ల మీద కూడా వికెట్లు తీయగల సమర్థత అతడికి మాత్రమే సొంతం. ముఖ్యంగా తన విలక్షణమైన బౌలింగ్ శైలి, మెరుపువేగంతో సంధించే బంతులతో బ్యాటర్లపై.. పైచేయి సాధించడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. మాంచెస్టర్ టెస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మ్యాచ్‌లో కనక టీమ్ఇండియా ఓడిపోతే సిరీస్‌ను కోల్పోవాల్సి వస్తుంది. అందుకే భారత జట్టు తన పూర్తి శక్తి, సామర్థ్యాలతో బరిలోకి దిగి, చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి! సిరాజ్ కూడా వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడాడు. నాలుగో మ్యాచ్‌లో ఏమేరకు ప్రభావం చూపుతాడో చెప్పలేని పరిస్థితి. అందుకే ఈ టెస్టులో బుమ్రాను కచ్చితంగా ఆడించాలనే వాదనలు వినిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com