World Championship: శ్రీకాంత్‌కు షాక్.. ప్రణయ్, లక్ష్యసేన్ శుభారంభం

ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్(World Badminton Championship 2023)లో పతకం సాధిస్తాడనుకున్న భారత స్టార్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth)కు ఎదురుదెబ్బ తగిలింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లోనే శ్రీకాంత్ నిష్క్రమించాడు. 14-21, 14-21తో 14వ సీడ్ జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటో చేతిలో ఈ స్టార్ షట్లర్ పరాజయం పాలయ్యాడు. మరోమ్యాచ్‌లో పతక అంచనాలున్న స్టార్ షట్లర్లు హెచ్‌ఎస్ ప్రణయ్(HS Prannoy), లక్ష్యసేన్( Lakshya Sen) శుభారంభం చేశారు. ప్రపంచ 9వ ర్యాంకర్ ప్రణయ్ 24-22, 21-10తో ఫిన్లాండ్‌కు చెందిన కొల్జొనెన్‌పై గెలుపొందాడు. 43 నిమిషాల పోరులో మొదటి గేమ్‌లో చెమటోడ్చిన ప్రణయ్.. రెండో గేమ్‌ను ఏకపక్షంగా ముగించాడు. 2021 కాంస్య పతక విజేత లక్ష్యసేన్ 21-12, 21-7తో మారిషస్ షట్లర్ జులియన్ పాల్‌ను ఓడించాడు. కేవలం 25 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించి రెండో రౌండ్ చేరుకున్నాడు.
ప్రీక్వార్టర్స్‌లో చోటు కోసం చికో ఇండోనేషియాకు చెందిన ఆరా ద్వి వార్దాయోతో ప్రణయ్, కొరియాకు చెందిన 9వ సీడ్ జియోన్‌తో లక్ష్యసేన్ తలపడనున్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్-సిక్కిరెడ్డి జోడీ పోరాటం తొలిరౌండ్‌కే పరిమితమైంది. రోహన్-సిక్కి జంట 14-21, 22-20, 18-21తో స్కాట్లాండ్ ద్వయం హాల్-మాఫెర్సన్ చేతిలో ఓటమిపాలైంది. తొలిరౌండ్‌లో బై లభించడంతో పీవీ సింధు, డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ, గాయత్రి-ట్రీసా జంట నేరుగా రెండోరౌండ్ ఆడనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com