BWF Rankings: తాజా ర్యాంకింగ్స్‌లో పీవీ సింధు స్థానం ఎంతంటే.....

డబుల్ ఒలింపిక్ విజేత పీవీ సింధు(PV Sindhu) BWF ప్రపంచ ర్యాంకింగ్స్(BWF Rankings) లో రెండు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకుంది. గతవారం ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌లో బీవెన్ జాంగ్ చేతిలో ఓడిపోయి ఆ టోర్నీ నుంచి పీవీ సింధు నిష్క్రమించింది. అయితే ఈ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడంతో ఈ భారత స్టార్ షట్లర్ రెండు స్థానాలను మెరుగుపర్చుకుంది. గతేడాది బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన పీవీ సింధు... అప్పటినుంచి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయిన సింధు రెండు స్థానాలు ఎగబాకింది.
పీవీ సింధు ఫామే భారత అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 36 మ్యాచ్‌లు ఆడిన సింధు.. 19 మ్యాచ్ల్లో గెలిచి, 17 మ్యాచ్‌లో ఓటమిపాలైంది. మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ (Madrid Spain Masters 2023)లో ఫైనల్ చేరడం మినహా సింధు ఈ ఏడాది మంచి ప్రదర్శన చేయలేదు.కెనడా ఓపెన్‌లో సెమీ ఫైనల్, యూఎస్ ఓపెన్, ఆస్త్రేలియా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.
మరో స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) 20వ స్థానానికి పడిపోయాడు. ఇంతకుముందు 19వ స్థానంలో ఉన్న అతను తాజాగా 20వ ర్యాంకుకు పడిపోయాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన హెచ్‌ఎస్ ప్రణయ్(HS Prannoy), లక్ష్య సేన్(Lakshya Sen).. వరుసగా ప్రపంచ నంబర్ 9, 11 స్థానాల్లో కొనసాగుతున్నారు. గత వారం సిడ్నీలో జరిగిన సూపర్ 500 టోర్నీలో తొలి సారి సెమీ ఫైనల్‌కు వెళ్లిన రజావత్.. మూడు స్థానాలు ఎగబాకి 28వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. మిథున్ మంజునాథ్, కిరణ్ జార్జ్ కూడా తమ స్థానాలు మెరుగుపరుచుకుని 43, 49 స్థానాల్లో నిలిచారు.
పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj), చిరాగ్ శెట్టి(Chirag Shetty) ప్రపంచ నంబర్ 2లో నిలిచి సత్తా చాటారు. ఈ ఏడాది సాత్విక్ – చిరాగ్ మూడు వరల్డ్ టూర్ టైటిళ్లు సాధించింది. ఇండోనేషియా ఓపెన్ ట్రోఫీ అందుకున్న మొదటి భారత డబుల్స్ జోడీగా వీళ్లిద్దరూ రికార్డు సృష్టించారు. మహిళల డబుల్స్‌లో త్రిషా జాలీ(Treesa Jolly), గాయత్రి గోపీచంద్(Gayatri Gopichand)లు రెండు స్థానాలు కోల్పోయి 19వ స్థానానికి పడిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com