TEAM INDIA: గంపెడాశలతో బరిలోకి టీమిండియా

ముచ్చటగా మూడోసారి వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న భారత్ అస్త్రశస్త్రాలతో మహా సంగ్రామంలో పోరాటానికి సిద్ధమైంది. ప్రపంచకప్‌ను ఒడిసిపట్టాలని ఏళ్ల తరబడి ప్రణాళికలు రచించిన టీమిండియా వాటిని చేసేందుకు సిద్ధమైంది. ప్రపంచకప్ జట్టు ప్రకటనకు ముందు ఉన్న సమస్యలన్నీ సమసిపోయినట్లు కనిపిస్తున్న వేళ ఈసారి భారత జట్టు కప్పు గెలవడం తధ్యమని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. అక్టోబర్ 8న కఠిన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌తో టీమిండియా ప్రపంచకప్ వేట ప్రారంభించనుంది.
2011 తర్వాత భారత్‌లో వన్డే ప్రపంచకప్ జరగనుండడంతో ఈసారి ఎలాగైనా కప్పును కైవసం చేసుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. అక్టోబర్ 8న అయిదుసార్లు ప్రపంచ కప్ విజేత, కఠిన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో రోహిత్ సేన తలపడనుంది. లీగ్ దశలో మిగిలిన తొమ్మిది జట్లతో భారత్ మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడనుంది. రోహిత్ సేన సెమీస్‌కు చేరడం ఖాయమని మాజీలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాకౌట్ మ్యాచ్‌లో ఒత్తిడిని తట్టుకుని రాణిస్తే భారత్ ప్రపంచకప్ గెలవడం సాధ్యమేనని అంచనా వేస్తున్నారు.
వన్డే ప్రపంచకప్ జట్టు ప్రకటనకు ముందు టీమిండియా అయోమయస్థితిలో.. ఉండేది. ఆటగాళ్ల ఫిట్‌నెస్, ఫామ్, గాయాలు ఇలా ఎటుచూసిన సమస్యలే కనిపించేవి. కానీ జట్టు ప్రకటన తర్వాత ఒక్కో సమస్య పరిష్కారమైంది. KL రాహుల్, శ్రేయస్ అయ్యర్‌ల ఫిట్‌నెస్, ఫామ్ మీద ఉన్న సందేహాలు పటాపంచలయ్యాయి. ఆసియా కప్‌లో పాక్‌పై రాహుల్.... ఆస్ట్రేలియా సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ అద్భుత శతకాలు బాది ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. ప్రధాన పేసర్ బుమ్రా గాయపడి జట్టుకు దూరం కావడంతో మన పేస్ విభాగంఒక్కసారిగా బలహీన పడింది. వెన్ను గాయంతో సుదీర్ఘ కాలం ఆటకు దూరమైన బుమ్రా గత నెలలో ఫిట్‌నెస్ సాధించి ఐర్లాండ్ పర్యటనకు కెప్టెన్‌గా వెళ్లాడు. అక్కడ ఫిట్‌నెస్, ఫామ్ చాటుకుని జట్టుకు కొండంత భరోసానిచ్చాడు. బుమ్రా భాగస్వామ్యంలో సిరాజ్ కూడా ఉత్తమ ప్రదర్శన చేస్తున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో రాణించిన షమి మూడో పేసర్‌గా ఖరారైపోయాడు. దీంతో భారత పేస్ విభాగం పటిష్టంగా మారింది. జడేజా, కుల్‌దీప్‌లకు తోడు అశ్విన్ చేరడం భారత స్పిన్ విభాగానికి వైవిధ్యం తెచ్చింది..
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియాకు స్వదేశంలో ఈ మెగా టోర్నీ జరగనుండడం అనుకూలంగా మారింది. అన్ని కలిసివచ్చి ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే మరో ప్రపంచకప్ భారత్‌కు చేరనుంది. 2011లో సొంతగడ్డపై భారత్ ప్రపంచకప్ నెగ్గగా 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లాండ్ స్వదేశంలోనే వన్డే విశ్వవిజేతలుగా నిలిచాయి. ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగి భారత్‌కు వన్డే ప్రపంచకప్ దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com