WCC: విశ్వ విజేత గుకేశ్

భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్.. సరికొత్త చరిత్ర సృష్టించాడు. కొత్త ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా ఆవిర్భవించాడు. 18 ఏళ్ల వయసులోనే విశ్వ విజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. క్లాసికల్ ఫార్మాట్‌లో డిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌తో జరిగిన 14 గేమ్‌ల పోరులో గుకేశ్ 7.5–6.5 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. 13 గేమ్‌లు ముగిసేసరికి ఇద్దరూ 6.5–6.5 పాయింట్లతో సమంగా ఉండగా నిర్ణాయక చివరి పోరులో గుకేశ్ తన సత్తా చాటాడు. 58 ఎత్తుల్లో లిరెన్ ఆట కట్టించి విజయగర్జన చేశాడు. 18 ఏళ్ల గుకేశ్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా, విశ్వనాథన్ ఆనంద్ తర్వాత వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన రెండో భారతీయుడిగా ఘనత సాధించాడు.
అరుదైన రికార్డు సాధించిన గుకేశ్
ఈ విజయంతో చెస్ ప్రపంచంలో గుకేశ్ అరుదైన రికార్డు సాధించాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. అతడి వయసు ప్రస్తుతం 18 ఏళ్లే. అతడు 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించడం గమనార్హం. కాగా 2012 తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న తొలి భారతీయుడిగా గుకేశ్ నిలిచాడు. కాగా గుకేశ్ తమిళనాడులోని చెన్నైలో పెరిగాడు. అయితే అతడి స్వస్థలం మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కావడం గమనార్హం. గుకేశ్ ఏడేళ్ల వయసులోనే చెస్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. అదే మక్కువతో అనేక పోటీల్లో విజయాలను అందుకున్నాడు. ఇప్పటికే ఆసియన్ చెస్ ఫెడరేషన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023గా నిలిచాడు. తాజాగా 18 ఏళ్ల వయసులోనే చెస్ ఛాంపియన్‌గా అవతరించాడు.
వరల్డ్ ఛాంపియన్‌కు సవాల్
ఈ ఏడాది ఏప్రిల్‌లో క్యాండిడేట్స్ టోర్నీ గెలుచుకొని వరల్డ్ చాంపియన్‌కు సవాల్ విసిరేందుకు సిద్ధమైన రోజు నుంచి గుకేశ్‌పై అంచనాలు పెరిగాయి. నవంబర్ 25 నుంచి మొదలైన ఈ సమరంలో 9 గేమ్‌లు ‘డ్రా’గానే ముగిశాయి. చివరి గేమ్‌కు ముందు చెరో రెండు గేమ్‌లు గెలిచిన ఇద్దరూ సమంగా ఉన్నారు. ఈ గేమ్ కూడా ‘డ్రా’ అయితే ‘టైబ్రేక్’ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చేది. కానీ గుకేశ్ ఆ అవకాశం ఇవ్వలేదు. తన అత్యుత్తమ ఆటను ప్రదర్శించి లిరెన్‌ను పడగొట్టాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com