CBN: భారీ లక్ష్యాలు నిర్దేశించుకుని నిరంతం శ్రమిస్తా

భారీ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం నిరంతరం పనిచేయడం తన రాజకీయ జీవితంలో ఒక భాగమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముందుచూపుతో ఆలోచిస్తూ, వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ, చిత్తశుద్ధితో కష్టపడితే అసాధ్యమని భావించిన లక్ష్యాలూ సాధ్యమేనన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో భాగంగా మూడో రోజు ఆయన జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో జరిగిన ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ దిశ, ప్రభుత్వ విధానాలు, పెట్టుబడుల ఆకర్షణపై విస్తృతంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ను పరిశ్రమలకు అనుకూలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనే భావనను మరింత ముందుకు తీసుకెళ్లి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. అనుమతుల ప్రక్రియను సరళీకృతం చేయడమే కాకుండా, పరిశ్రమలు స్థాపించాలనుకునే పెట్టుబడిదారులకు వేగంగా క్లియరెన్సులు ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. అనుమతి దశ నుంచి పరిశ్రమ పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభించే వరకు ప్రతి అంశాన్ని రియల్ టైమ్‌లో మానిటరింగ్ చేస్తున్నామని వెల్లడించారు.
ఈ విధానాల ఫలితంగానే విశాఖపట్నానికి గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజ సంస్థను తీసుకురాగలిగామని చంద్రబాబు తెలిపారు. గూగుల్ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పెట్టుబడిని సాధించడంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చూపిన చొరవ, నిరంతర ఫాలోఅప్ ప్రధాన పాత్ర పోషించాయని ప్రత్యేకంగా ప్రశంసించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటోందని చెప్పారు. వ్యవసాయ రంగంలో కూడా సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామని సీఎం వివరించారు. అగ్రిటెక్ విధానాన్ని అమలు చేస్తూ రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. ఉత్పత్తి పెంపు, ఖర్చుల తగ్గింపు, మార్కెట్‌కు నేరుగా అనుసంధానం వంటి అంశాల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. అదే సమయంలో గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా వంటి భవిష్యత్ రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోందన్నారు. ప్రపంచం మొత్తం గ్రీన్ అమ్మోనియాపై చర్చిస్తున్న దశలోనే, రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటికే విదేశాలకు గ్రీన్ అమ్మోనియా ఎగుమతి చేసేందుకు ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు.
భారత్ అభివృద్ధి ప్రయాణంలో 30 ఏళ్ల క్రితమే కీలక సంస్కరణలు ప్రారంభమయ్యాయని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు ఆ సంస్కరణల ఫలితాలను మరింత విస్తృతంగా ప్రజలకు అందించే దశకు వచ్చామని చెప్పారు. ఈ మార్పుల వల్లే రాష్ట్ర యువతకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. టెక్నాలజీ, గ్రీన్ మరియు బ్లూ ఎకానమీ భావనలతో అమరావతిని భవిష్యత్ నగరంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అమరావతిని గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
